పిచ్చికుక్క దాడిలో పసికందు దుర్మరణం

తల్లిపాలు తాగి అప్పుడే నిద్రలోకి జారుకున్న పసికందును పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. కన్నపేగు తెంచుకొని పుట్టిన పసిగుడ్డు కళ్లముందే విలవిల్లాడుతోంటే ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.

Published : 18 Jun 2024 03:19 IST

తొర్రూరు, న్యూస్‌టుడే: తల్లిపాలు తాగి అప్పుడే నిద్రలోకి జారుకున్న పసికందును పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. కన్నపేగు తెంచుకొని పుట్టిన పసిగుడ్డు కళ్లముందే విలవిల్లాడుతోంటే ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. పరుగుపరుగున ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం చెట్లముప్పారం గ్రామానికి చెందిన వెంకన్న, రేణుక దంపతులకు మూడేళ్ల వయసున్న కుమారుడు ఉండగా.. 42 రోజుల కింద రెండో కాన్పులో మళ్లీ మగ బిడ్డ జన్మించాడు. అప్పటినుంచి రేణుక మడిపల్లిలోని పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఉదయం చిన్న కుమారుడికి రేణుక పాలు పట్టి.. ఇంటి బయట మంచంపై పడుకోబెట్టి, ముఖం కడుక్కొంటోంది. ఆమె తల్లి వెంకటలక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటోంది. అకస్మాత్తుగా వచ్చిన ఓ పిచ్చికుక్క నిద్రిస్తున్న పసికందుపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవులు, తలభాగంలో కర్కశంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మెదడు బయటకు వచ్చింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని