ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..

పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Updated : 18 Jun 2024 05:44 IST

యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం

బయ్యారం, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొట్టెం లక్ష్మీనారాయణ, నీలావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ సభ్యులు పదిహేనేళ్లుగా భువనగిరి సమీపంలోని చందుపట్ల వద్ద కోళ్లఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్దకుమార్తె రవళి(21)కి 2022లో ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. రెండు నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటూ కోళ్లఫారంలో పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ కుటుంబం తరచూ కోటగడ్డలో తమ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో రవళికి, కోటగడ్డలోని తమ ఇంటి సమీపంలో ఉంటున్న యువకుడు మెండు రవీందర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల కిందట వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోగా రవళి, రవీందర్‌ కుటుంబసభ్యులు వేర్వేరుగా వారిద్దరూ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బయ్యారం, భువనగిరి పోలీసులు కలిసి శ్రీకాకుళంలో ఉన్న వారిని వారం రోజుల కిందట తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రవళి కుటుంబం ఆమె భర్త గురించి, ప్రేమ వ్యవహారం విషయమై గ్రామ పెద్దల్లో పంచాయితీ పరిష్కారం కోసం కోటగడ్డకు వచ్చారు. గ్రామానికి వచ్చిన రవళి తాను రవీందర్‌ను పెళ్లిచేసుకుంటానని చెప్పి రెండు రోజుల కిందట రవీందర్‌ ఇంటికి వెళ్లారు. సోమవారం గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం ఇంట్లో ఓ గదిలోకి వెళ్లిన రవళి, రవీందర్‌ గడియపెట్టుకొని ఎంతసేపటికి బయటకు రాలేదు. గదిలో నుంచి శబ్దం రావడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూశారు. రవళి ఉరి వేసుకొని కనిపించగా రవీందర్‌ రక్తపుమడుగులో పడిఉన్నారు. రవళిని కిందకు దించేలోపే ప్రాణాలు కోల్పోగా, రవీందర్‌ చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. రవళి, రవీందర్‌ ఒకేసారి వేర్వేరుగా ఉరి వేసుకోగా రవీందర్‌ ఉరి జారిపోయి కిందపడ్డారు. దీంతో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రవీందర్‌ను మహబూబాబాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. రవళి తండ్రి లక్ష్మీనారాయణ పెళ్లైన తన బిడ్డను భర్తకు దూరంగా ఉందనే సాకుతో నమ్మించి రవీందర్‌ ప్రేమపేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. అతన్ని నమ్మి ఇంటికి వెళ్లిన తమ బిడ్డను రవీందర్‌ కుటుంబసభ్యులు హత్య చేశారని అందులో ఆరోపించారు. సీఐ రవికుమార్, గార్ల, బయ్యారం ఎస్సైలు జీనత్‌కుమార్, ఉపేందర్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని