కుమార్తెను కాపాడే క్రమంలో తండ్రి మృత్యువాత

అప్పటి దాకా సరదాగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. జలాశయంలో పడిపోయిన కుమార్తెను రక్షించబోయిన తండ్రి మృతి చెందడం వారిని ఆవేదనలో ముంచెత్తింది.

Updated : 18 Jun 2024 06:48 IST

దిగువ మానేరు జలాశయంలో ఘటన

విజయ్‌కుమార్‌ 
తిమ్మాపూర్, న్యూస్‌టుడే : అప్పటి దాకా సరదాగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. జలాశయంలో పడిపోయిన కుమార్తెను రక్షించబోయిన తండ్రి మృతి చెందడం వారిని ఆవేదనలో ముంచెత్తింది.. కళ్ల ముందే ఇంటి పెద్ద మృత్యువాత పడటంతో బాధిత కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచి వేసింది.. కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని సంతోష్‌ నగర్‌కు చెందిన బంగారి విజయ్‌కుమార్‌ (47) కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ పే అండ్‌ అకౌంట్‌ (వర్క్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌)లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. సోమవారం సెలవు కావడంతో ఉదయం తన భార్య ప్రశాంతి, పిల్లలు సాయినిత్య, విక్రాంత్, అత్తమ్మ పుష్పలతలతో కలిసి కారులో హుస్నాబాద్‌లోని పొట్లపల్లి శివాలయానికి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అలుగునూర్‌ వద్ద ఎల్‌ఎండీని చూద్దామని జలాశయం పైకి వెళ్లారు. హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నుంచి కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేసే ప్రదేశం వద్ద కుమార్తె సాయినిత్య నీళ్లను చూస్తూ చరవాణిలో ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలాశయంలో పడిపోయింది. గమనించిన విజయ్‌కుమార్‌ కుమార్తెను కాపాడేందుకు నీటిలోకి దూకగా తండ్రిని చూసి పదిహేనేళ్ల కుమారుడు విక్రాంత్‌ సైతం నీటిలో దూకాడు. పిల్లలిద్దరిని గట్టు వైపునకు నెట్టిన విజయ్‌కుమార్‌ మాత్రం నీట మునిగారు. ఒడ్డుపై ఉన్న ప్రశాంతి, పుష్పలత కేకలు వేయగా అక్కడే ఉన్న జాలరి శంకర్‌ తెప్ప సాయంతో పిల్లలిద్దరిని కాపాడారు. అప్పటికే విజయ్‌కుమార్‌ నీట మునిగి చాలాసేపు కావడంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబసభ్యులను మానకొండూర్‌ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. పిల్లలను కాపాడిన జాలరిని ఎమ్మెల్యే, ఎస్సై అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని