బంగారం.. నోట్లు.. పోలీసు.. అన్నీ నకిలీనే

బంగారం పేరుతో వ్యాపారులకు టోకరా వేసి రూ.కోట్లు కొట్టేస్తున్న ఘరానా ముఠాలోని నలుగుర్ని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 19 Jun 2024 04:17 IST

తక్కువ ధరకే పుత్తడి విక్రయిస్తామంటూ వ్యాపారులకు టోకరా
రూ.6.86 కోట్ల నకిలీ కరెన్సీ, బంగారం పట్టివేత.. నలుగురి అరెస్టు

స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీని పరిశీలిస్తున్న సీపీ తరుణ్‌జోషి,
డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి, సీఐ గోవిందరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  బంగారం పేరుతో వ్యాపారులకు టోకరా వేసి రూ.కోట్లు కొట్టేస్తున్న ఘరానా ముఠాలోని నలుగుర్ని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రూ.6.86 కోట్ల నకిలీ నోట్లు, 5కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు, రూ.51 లక్షల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, డీసీపీ పీవీ పద్మజతో కలిసి రాచకొండ సీపీ తరుణ్‌జోషి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.

బీటెక్‌ పూర్తవగానే నేరాలు

ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి కంచరమెట్టకు చెందిన కర్రెద్దుల విజయ్‌కుమార్‌ అలియాస్‌ కృష్ణమోహన్‌(39) బీటెక్‌ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ విజయ్‌.. సమీప గ్రామంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసే వ్యక్తితో పరిచయం పెంచుకొని.. అతనూ నేర్చుకున్నాడు. విజయ్‌కి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నంబూరి డేవిడ్‌ లివింగ్‌ స్టోన్‌ అలియాస్‌ సెంథిల్‌(52), నెల్లూరు కావలికి చెందిన బోగిరి సునీల్‌ గవాస్కర్‌ అలియాస్‌ హరీశ్‌(26), అడిగోపుల ఓం సాయి కిరీటి(26) పరిచయమయ్యారు. ఈ నలుగురూ బెంగళూరు కేంద్రంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోసాలకు పాల్పడతారు. 2010 నుంచి మోసాలు చేస్తున్న ప్రధాన నిందితుడు విజయ్‌పై 13 కేసులున్నాయి. నాలుగు కేసుల్లో పరారీలో ఉన్నాడు. డేవిడ్‌ మీద రెండు కేసులున్నాయి.

కదలికలపై నిఘా.. నిందితుల ఆటకట్టు

బోడుప్పల్‌కు చెందిన వ్యాపారి దిలీప్‌ బర్ఫా తన మిత్రుడు సింగిరెడ్డి సురేశ్‌తో కలిసి మే 19న బెంగళూరులో విజయ్, సునీల్‌ను కలిశారు. బర్ఫాను నమ్మించేందుకు 101 గ్రాముల అసలు బంగారాన్ని రూ.6లక్షలకే విక్రయించారు. దీంతో బర్ఫాకు నమ్మకం కలిగి రెండు కిలోల బంగారం కావాలని చెప్పగా రూ.1.1 కోట్లకు ఇస్తామని నిందితులు చెప్పారు. బర్ఫా రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. మే 29న బర్ఫా, సురేశ్‌ ఇద్దరూ మరోమారు బెంగళూరుకు వెళ్లారు. వీరి కళ్లముందే విజయ్‌ 5 కిలోల బంగారం అమ్మి.. రూ.కోట్లలో డబ్బు తీసుకుంటున్నట్లు నటించాడు. తర్వాత బర్ఫా రూ.90లక్షలు ఇవ్వగా.. నిందితులు నకిలీ బంగారం ఇచ్చారు. తిరిగి వస్తుండగా సాయి కిరిటీ నకిలీ పోలీసులా వచ్చి బంగారం స్వాధీనం చేసుకుని వెళ్లిపోయాడు.  బాధితుడు మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించాడు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి, ఎస్సై నర్సింగరావు  కీసరలో నలుగుర్ని ఒకేసారి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని