కత్తుల దాడులతో కలకలం

కత్తులతో గొంతు కోసిన ఘటనలు జిల్లాలో కలకలం రేపాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలో పాత కక్షలతో నిందితులుఓ వ్యక్తి గొంతు కోయగా, లింగంపేటలో బావను బావమరిది కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు.

Updated : 19 Jun 2024 06:27 IST

వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి తీవ్రగాయాలు

కత్తులతో గొంతు కోసిన ఘటనలు జిల్లాలో కలకలం రేపాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలో పాత కక్షలతో నిందితులుఓ వ్యక్తి గొంతు కోయగా, లింగంపేటలో బావను బావమరిది కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలతో  స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కక్ష పెంచుకుని.. మెడ కోసి

నాగిరెడ్డిపేట్, న్యూస్‌టుడే: నాగిరెడ్డిపేట్‌ మండలంలోని రాఘవపల్లి గ్రామంలో పాత కక్షల కారణంగా నిందితులు సోమవారం రాత్రి వ్యక్తి గొంతు కోశారు. ఎస్సై రాజు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్లారు. అతడిపై గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పోచమ్మ గుడి ప్రాంతంలో కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి పాత కక్షలే కారణమని తెలిపారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి కుమార్తె (దివ్యాంగురాలు)పై రెండేళ్ల కిందట గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిపై కేసులు నమోదు కావడంతో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చారు. కక్ష పెంచుకున్న జూకంటి రమేశ్, పుట్ల శ్యాం, జూకంటి సాయిలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి బావమరిది తన మిత్రుడితో కలసి పొలానికి వెళ్లి వస్తుండగా రక్తపు మడుగులో ఉన్న అతడిని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడ్ని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దాడికి వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 


లింగంపేటలో బావపై బావమరిది హత్యాయత్నం 

లింగంపేట, న్యూస్‌టుడే: బావపై బావమరిది కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన లింగంపేటలోని మేంగారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేంగారం వద్ద సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బోనాల్‌ గ్రామానికి చేందిన నీల స్వామి, అతని బావమరిది నవీన్, సుధాకర్‌లు మద్యం తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో నవీన్, సుధాకర్‌లు నీలస్వామిపై కత్తితో దాడి చేసి గొంతు కోశారు. వారి నుంచి తప్పించుకున్న నీలాస్వామి మేంగారం గ్రామంలోకి వెళ్లి గ్రామస్థుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై ప్రకాశ్‌ ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన స్వామిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి నీల అల్లవ్వ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నవీన్, సుధాకర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని