నేనింతే.. మారనంతే!.. ఎస్సై భవానీసేన్‌పై ఆది నుంచి వివాదాలే..

కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ కటకటాలపాలయ్యాడు. తన కింద పనిచేసే ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆయన చివరికి ఊచలు లెక్కపెడుతున్నాడు.. మహదేవపూర్‌ రెండో ఎస్సైగా పనిచేస్తున్న భవానీసేన్‌ నాలుగు నెలల కిందట కాళేశ్వరం ఎస్సైగా నియమితులయ్యారు.

Updated : 20 Jun 2024 07:52 IST

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ కటకటాలపాలయ్యాడు. తన కింద పనిచేసే ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆయన చివరికి ఊచలు లెక్కపెడుతున్నాడు.. మహదేవపూర్‌ రెండో ఎస్సైగా పనిచేస్తున్న భవానీసేన్‌ నాలుగు నెలల కిందట కాళేశ్వరం ఎస్సైగా నియమితులయ్యారు.

మంత్రి పేరు చెప్పుకొంటూ..!

కాళేశ్వరం ఠాణాలో  చేరినప్పటి నుంచి ఆయన చుట్టూ నిత్యం వివాదాలే.. మంత్రి శ్రీధర్‌బాబు ప్రమేయం లేకుండానే ఆయన పేరును వాడుకుంటూ ఉన్నతాధికారులను లెక్క చేయడం మానేశాడు. ఠాణాకు వచ్చిన వారికి తన రాజకీయ పలుకుబడి గురించి గొప్పలు చెప్పుకొనేవాడు.

ఆది నుంచి వివాదాలే..

గతంలో మంచిర్యాల జిల్లాలోని పలు పోలీసు ఠాణాల్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన సమయంలో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసిన ఆయన సతీమణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

  •  కుమురంభీం జిల్లా  రెబ్బెన మండలం ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి కావాల్సిన పుస్తకాలు కొనిస్తానని, కోచింగ్‌ ఇప్పిస్తానని చెప్పి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సస్పెండ్‌ చేశారు.
  • కాళేశ్వరం ఎస్సైగా వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన దృష్టి కొందరి మహిళలపై పడింది. ఆయన తీరు నచ్చని పలువురు మహిళా కానిస్టేబుళ్లు ఆయన ఛాంబర్‌లోకి వెళ్లాలంటే జంకుతుండేవారు.

 బెదిరింపులు.. వసూళ్లు..

  •  ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో కాళేశ్వరంలోని కొంతమంది చిట్టీ వ్యాపారులను బెదిరించారని సమాచారం.
  •  ఆటో డ్రైవర్లను బెదిరించడంతో పాటు చికెన్‌ వ్యాపారులను తనకు నిత్యం కిలో చికెన్‌ కావాలని హుకూం జారీ చేసినట్లు చెబుతారు.
  •  అటవీ ప్రాంతంలో నిత్యం జూదం ఆడేవారు, గొలుసు మద్యం దుకాణాల నిర్వాహకులు, ట్రాక్టర్ల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేసేవాడు.
  •  ఎన్నికల సమయంలో బెల్టు షాపుల వద్ద స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కొందరికి తిరిగి ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని చెబుతారు.   
  •  కాళేశ్వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో కొన్ని కుర్చీలను ఠాణాకు తరలించినట్లు సమాచారం.

తప్పించుకునే యత్నం  

ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, సుమారు 50 మంది పోలీసుల వలయంలో ఉన్న కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా కానిస్టేబుల్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భూపాలపల్లి, కాటారం డీఎస్పీలతో పాటు హనుమకొండ ఎస్బీ డీఎస్పీ ఆధ్వర్యంలో అయిదుగురు సీఐలు, పలువురు పోలీసులు మంగళవారం రాత్రి కాళేశ్వరం ఠాణాకు చేరుకున్నారు. అది గమనించి ఎస్సై భవానీసేన్‌ ఓ ప్రైవేట్‌ వాహనంలో తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు.

సీఐకి స్థాన చలనమే....

ఎస్సై భవానీ సేన్‌ దుశ్చర్య నేపథ్యంలో మహదేవపూర్‌ సీఐ రాజేశ్వర్‌రావుకు కూడా స్థాన చలనం తప్పదని భావిస్తున్నారు. మూడు ఠాణాల పరిధిలో సీఐగా వ్యవహరిస్తున్నా ఎస్సైలపై పట్టు సాధించలేదని తెలుస్తోంది. ఠాణా పరిధిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకుండా వ్యవహరించారనే విమర్శలున్నాయి. త్వరలో ఆయనకు స్థాన చలనం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల సీఐలు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.  కరోనా సమయంలో కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహించి పదోన్నతితో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ఒకరు మహదేవపూర్‌ రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని