సిమ్‌కార్డుల దందా నడిపే ముఠా అరెస్టు

సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠా సభ్యులను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పట్టుకుంది.

Published : 20 Jun 2024 05:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠా సభ్యులను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పట్టుకుంది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గుర్ని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతోంది. దుబాయిలో పాగా వేసిన కీలక నిందితుడి కోసం వేట కొనసాగిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సంచాలకులు శిఖాగోయల్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పాడి ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు చోరీ చేసి సిమ్‌కార్డులు సమకూర్చుకుంటున్నారు. ఆయా పేర్లతో బ్యాంకు ఖాతాలు తెర్చి వీటిని సైబర్‌నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు. ముఠాసభ్యులు జీడిమెట్ల చింతల్‌కు చెందిన కె.నవీన్‌ (22), జగద్గిరిగుట్టకు చెందిన షేక్‌ సుభానీ(26), ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చెందిన ఎం.ప్రేమ్‌కుమార్‌ అలియాస్‌ మైఖెల్‌ అలియాస్‌ మైక్‌ టైసన్‌ (24)ను బుధవారం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 113 సిమ్‌కార్డులు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారమంతా దుబాయ్‌లో మకాం వేసిన విజయ్‌ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని,  టెలిగ్రాం యాప్‌లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి అక్రమ సిమ్‌ కార్డుల దందా నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన సిమ్‌కార్డుల్లో కొన్ని థాయ్‌లాండ్, కంబోడియాలకు కూడా రవాణా అవుతున్నాయని వెల్లడించారు.ఈ ముఠాలో మిగతా వారి కోసం గాలిస్తున్నామని శిఖాగోయల్‌ వెల్లడించారు. డీఎస్పీ కేవీఎం ప్రసాద్, సీఐ మహేందర్, ఎస్సై శివ, హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ తదితరులు ఈ ముఠా గుట్టురట్టు చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని