గొంతులో గులకరాయి ఇరుక్కొని చిన్నారి మృతి

అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి గొంతులో గులకరాయి ఇరుక్కుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు.

Published : 21 Jun 2024 06:07 IST

చేర్యాల, న్యూస్‌టుడే: అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి గొంతులో గులకరాయి ఇరుక్కుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. బుజ్జిబుజ్జి మాటలతో సందడి చేసిన పాపాయి కళ్లు తేలేస్తుంటే కాపాడుకోవడానికి కన్నవారు చేయని ప్రయత్నం లేదు. అవేవి ఫలించక వారి కళ్ల ముందే ఏడాదిన్నర చిన్నారి మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. కడవేర్గు గ్రామానికి చెందిన షబీర్‌పాషా- జరీనాబేగం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలతో కలిసి జరీనాబేగం రాంసాగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం అక్కడ ఇంటి ముందు ఆటలాడుకుంటూ చిన్న కుమార్తె అలీషా గులకరాయి మింగింది. ఏడుస్తున్న చిన్నారిని కుటుంబ సభ్యులు ఎత్తుకొని ఓదార్చసాగారు. కాని ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి నోట్లో చూడగా మట్టి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. గొంతు దగ్గర ఉబ్బినట్లు ఉండడంతో గమనించగా మట్టితోపాటు గులకరాయి మింగడంతో అది ఇరుక్కున్నట్లు గుర్తించారు. షబీర్‌పాషా కూడా అక్కడకు చేరుకుని వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సిద్దిపేటకు వెళ్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి చనిపోయింది. బాలిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న షబీర్‌పాషా చిన్న కుమార్తె మృతితో కన్నీరు మున్నీరయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని