విద్యుదాఘాతంతో దంపతుల మృతి

ఖమ్మం జిల్లా వైరా పట్టణం హనుమాన్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి ఇంట్లో దుస్తులు ఆరవేసే ఇనుప తీగకు విద్యుత్‌ ప్రవహించడంతో వృద్ధ దంపతులు మృతి చెందారు.

Published : 22 Jun 2024 04:23 IST

భార్యకు షాక్‌.. కాపాడే యత్నంలో భర్తకూ ప్రమాదం

వైరా, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా వైరా పట్టణం హనుమాన్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి ఇంట్లో దుస్తులు ఆరవేసే ఇనుప తీగకు విద్యుత్‌ ప్రవహించడంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. పాతబస్టాండ్‌ పెట్రోల్‌బంకు ఎదురుగా ఉన్న హనుమాన్‌ బజార్‌లో పల్లపు ఆంజనేయులు (62), పల్లపు నర్సమ్మ (56) దంపతులు తమ చిన్న కుమారుడు సతీశ్‌ ఇంట్లోని వెనుక గదిలో నివసిస్తున్నారు. రాత్రి సమయంలో నర్సమ్మ బాత్‌రూమ్‌కు వెళ్తుండగా.. దుస్తులు ఆరేసేందుకు కట్టి ఉన్న ఇనుప జీవైర్‌ను తాకింది. అప్పటికే ఆ వైర్‌లో విద్యుత్‌ ప్రవహిస్తుండడంతో ఆమెకు షాక్‌ తగిలి బిగ్గరగా అరిచింది. సమీపంలో ఉన్న భర్త ఆంజనేయులు పరుగున వచ్చి భార్యను పట్టుకోవడంతో అతడికి కూడా విద్యుదాఘాతం సోకింది. వారి అరుపులు విని కోడలు శ్యామిని అక్కడకు రాగా.. దగ్గరకు రావొద్దంటూ మామ ఆంజనేయులు సైగలు చేయడంతో ఆమె కేకలు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చినా.. అప్పటికే దంపతులు మృతి చెందారు. వారిద్దరూ కష్టజీవులు. నిత్యం మట్టి పని లేదా కాంక్రీటు పనులు చేసుకుని జీవించేవారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఊహించని ప్రమాదంతో వారింట విషాదం అలముకుంది. దంపతుల చిన్న కుమారుడు సతీశ్‌ కుటుంబ సభ్యులతో శనివారం తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని