సొంత భూమిలో వెట్టి!

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై ఇటీవల పాశవికంగా జరిగిన దాడి ఘటనలో కొత్త కోణాలు బహిర్గతం అయ్యాయి. శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 22 Jun 2024 07:03 IST

ట్రాక్టర్‌లో ఒక గంటలోనే ఇసుక నింపాలి
లేదంటే దెబ్బలు కాచుకోవాలి...
చెంచు మహిళపై పాశవిక దాడి ఘటనలో కొత్త కోణాలు 
కేసు నుంచి కొందరిని తప్పించారని ఆరోపణలు

నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈశ్వరమ్మకు సపర్యలు చేస్తున్న భర్త ఈదన్న, తల్లి పెంటమ్మ

ఈనాడు, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై ఇటీవల పాశవికంగా జరిగిన దాడి ఘటనలో కొత్త కోణాలు బహిర్గతం అయ్యాయి. శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించారు. అయితే... కీలక సూత్రధారి ఒక ప్రధాన పార్టీకి మద్దతుదారు కావడంతో ఆయనతోపాటు మరికొందరికిపై కేసులు నమోదు చేయడం లేదని చెంచులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం... ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న మొదట కొల్లాపూర్‌లోని ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలు తీసుకుని, కూలి పనికి కుదిరారు. వారు పని సక్రమంగా చేయడం లేదంటూ అతను ఇబ్బందులు పెట్టాడు. ఈ క్రమంలో ఈశ్వరమ్మ భూమిని స్వగ్రామంలో కౌలుకు తీసుకున్న బండి వెంకటేశ్‌... కొల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి రూ.30 వేలను చెల్లించేశాడు. భార్యాభర్తలను మొలచింతలపల్లికి తీసుకొచ్చి, తన పొలంలోనే పనికి పెట్టుకున్నాడు. వారికి ఎలాంటి కూలీ చెల్లించేవాడు కాదు. పైగా అతను అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్‌ కేంద్రంలోనూ పని చేసేందుకు తరచూ పంపించేవాడు. ఒక గంటలోనే ట్రాక్టర్‌ను ఇసుకతో నింపాలని ఈశ్వరమ్మను ఆదేశించేవాడు. లేదంటే దుర్భాషలాడుతూ, భౌతికదాడులకు దిగేవాడు. ఈ బాధలను తాళలేక ఆమె తన భర్తతో గొడవపడి చుక్కాయిపల్లికి వెళ్లిపోయారు. బండి వెంకటేశ్, అతని కుటుంబ సభ్యులు ఆమెను పదిరోజుల కిందట మొలచింతలపల్లికి తీసుకొచ్చి దారుణంగా కొట్టారు. కళ్లు, జననాంగాల్లో కారం పోసి కొట్టారు. శరీరంపై కాల్చి, వాతలు పెట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ దారుణ విషయం బుధవారం రాత్రి వెలుగులోకి రావడంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి, ఈశ్వరమ్మను నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలను చూసి వైద్యులు కూడా నివ్వెరపోయారు. తనపై దాడి చేసిన వారి పేర్లను వెల్లడించేందుకు బాధితురాలు భయపడుతున్నారంటే... నిందితుల ఆగడాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

కీలక నిందితులను వదిలి కూలీలపై కేసులు 

చెంచు సంఘాల కథనం ప్రకారం... కేసులు నమోదైన వారిలో బండి వెంకటేశ్, ఆయన భార్య శివమ్మ; లింగస్వామి, ఆయన భార్య లక్ష్మి ఉన్నారు. వీరిలో లింగస్వామి, లక్ష్మి కూడా వెంకటేశ్, ఆయన సోదరుడు శివుడు నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్‌ కేంద్రంలో రెండేళ్ల నుంచి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కూడా ఈశ్వరమ్మపై తరచూ దాడి చేసేవారు. దీంతో పోలీసులు వీరిపైనా కేసు నమోదు చేశారు. దాడిలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్‌ కుటుంబ సభ్యుల్లో కొందరిపై కేసు పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈశ్వరమ్మపై దాడి ఘటన వీడియోలో... కనిపిస్తున్న నిందితులందరిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి: భారాస 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, శాంతిభద్రతలు దిగజారాయని భారాస నేతలు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, గువ్వల బాలరాజు ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... ‘‘చెంచు మహిళపై దాడి ఘటనలో నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదు. తక్షణమే బాధితురాలికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. మహిళకు రక్షణ లేక పోతే ఎలా? రాష్ట్రంలో నయీం ముఠా ఆనవాళ్లు మళ్లీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి భద్రతలను పరిరక్షించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

నిష్పక్షపాతంగా విచారణ: నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌  

చెంచు మహిళపై దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించాం. విచారణలో ఇంకా ఎవరైనా ఉన్నట్లు తేలితే వారిపైనా కేసులు నమోదు చేస్తాం. విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతోంది. మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని