బగ్గా డిస్టిలరీ నుంచి 100 కార్టన్ల మద్యం మాయం

డిస్టిలరీలో తయారైన మద్యం డిపోనకు కాకుండా పక్కదారి పట్టిన ఉదంతం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో కలకలం రేపింది. శంషాబాద్‌ ఎక్సైజ్స్టేషన్‌ పరిధిలోని సాతంరాయిలో ఉన్న బగ్గా డిస్టిలరీలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం రాత్రి తనిఖీలు చేయడంతో బండారం బహిర్గతమైంది.

Published : 22 Jun 2024 04:31 IST

డిపోకు కాకుండా గుట్టుగా బయటికి తరలించిన సిబ్బంది
జీఎం అరెస్ట్‌

కాలం చెల్లిన లేబుళ్లు అతికించిన మద్యం కార్టన్లతో ఎక్సైజ్‌శాఖ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: డిస్టిలరీలో తయారైన మద్యం డిపోనకు కాకుండా పక్కదారి పట్టిన ఉదంతం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో కలకలం రేపింది. శంషాబాద్‌ ఎక్సైజ్స్టేషన్‌ పరిధిలోని సాతంరాయిలో ఉన్న బగ్గా డిస్టిలరీలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం రాత్రి తనిఖీలు చేయడంతో బండారం బహిర్గతమైంది. కేసు నమోదు చేసి.. డిస్టిలరీస్‌ జీఎం రమేశ్, యజమాని జస్మిత్‌సింగ్‌ బగ్గా, ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జి పాశం లింగారెడ్డి, గోదాం ఇన్‌ఛార్జి మామిండ్ల అశోక్, స్కానింగ్‌ ఇన్‌ఛార్జి వెంకటేశ్‌తోపాటు బగ్గా డిస్టిలరీస్‌ను నిందితుల జాబితాలో చేర్చారు. ప్రధాన నిందితుడు రమేశ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. మిగతా నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. గుట్టుగా తరలించిన మద్యం విలువ రూ.5.6 లక్షలుగా తేల్చారు. 

డిస్టిలరీలో తయారైన మద్యం సీసాలకు మొదట లేబులింగ్‌ చేస్తారు. అనంతరం దాన్ని స్కాన్‌ చేసి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని డిపోనకు తరలిస్తారు. బగ్గా డిస్టిలరీ జీఎం రమేశ్‌ వ్యక్తిగత కారణాలతో ఈ నెల 8న సెలవులో వెళ్లారు. 12న తిరిగి వచ్చాక తనిఖీ చేయగా ఈ నెల 5న తయారైన చీప్‌ లిక్కర్‌లో సుమారు 100 కార్టన్లు తగ్గినట్లు గుర్తించారు.విచారణలో కొంతమంది సిబ్బంది గుట్టుగా బయటకు తరలించినట్లు తేలింది. అయితే విషయం బయటికి పొక్కనీయకుండా నిందితుల బృందంతో చేతులు కలిపి.. మాయమైన మద్యాన్ని భర్తీ చేసేందుకు పూనుకున్నారు. ఈఎన్‌ఏ అనే ముడిసరకును బయట నుంచి అక్రమంగా తెప్పించి మద్యం తయారు చేశారు. అనంతరం సీసాల్లో నింపి 100 కార్టన్లు సిద్ధం చేశారు. కానీ వాటికి లేబుళ్లు అతికించాల్సి ఉండటంతో డిస్టిలరీ ఆఫీసర్‌ రూంలో వృథాగా పడి ఉన్న కాలం చెల్లిన లేబుళ్లను అపహరించారు. అయితే అవి 73 కార్టన్ల మేరకే సరిపోయాయి. ఇంతలో వీరి నిర్వాకంపై ఎక్సైజ్‌ అధికారులకు ఉప్పందడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జీఎం రమేశ్‌ను విచారించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. మిగిలిన నిందితులు దొరికితే రమేశ్‌ వాంగ్మూలంలో వాస్తవమెంత అనేది తేలుతుందని శంషాబాద్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని