కడుపునొప్పితో ఎమ్మెల్యే భార్య బలవన్మరణం!

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి (40) హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలో గురువారం రాత్రి చున్నీతో ఉరేసుకోగా... మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.

Updated : 22 Jun 2024 06:34 IST

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌ అల్వాల్, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి (40) హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలో గురువారం రాత్రి చున్నీతో ఉరేసుకోగా... మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై ఎటువంటి గాయాల్లేవని వైద్యులు ధ్రువీకరించారు. కడుపు నొప్పి బాధను భరించలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యకు అనారోగ్య సమస్య ఎంతవరకు కారణమనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే సత్యం తన నియోజకవర్గానికి వెళ్లారు. రాత్రి 10.30 గంటల సమయంలో రూపాదేవి భర్తకు ఫోన్‌ చేయగా ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. వీడియోకాల్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పటంతో వెంటనే సత్యం కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వెంటబెట్టుకొని అల్వాల్‌ వచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఆయన వెక్కివెక్కి ఏడ్వడం.. ఒక్కసారి లే అమ్మా అంటూ బిడ్డల రోదనతో చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. రూపాదేవి తల్లి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఓ గదిలో ఉండగా రూపాదేవి వేరే గదిలో ఉరేసుకున్నారు. తన కుమార్తె కడుపు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతోందని, కొద్దిరోజులుగా తీవ్రం కావటంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడినట్టు రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు తెలిపారు.

ఓయూ కలిపింది ఇద్దరినీ

కూకట్‌పల్లి పరిధిలో నివాసం ఉండే రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. చదువుకొనే రోజుల్లో సత్యంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2012లో కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు యోజిత్‌ (11), కూతురు రుషికశ్రీ (8) సంతానం. ప్రస్తుతం రూపాదేవి మేడ్చల్‌లోని రావల్‌కోల్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితమే ఈ కుటుంబం అల్వాల్‌లోని పంచశీలకాలనీ అపార్టుమెంటుకు చేరింది.

ఎమ్మెల్యే సత్యం, పిల్లలను మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కవ్వంపల్ల్లి సత్యనారాయణ తదితరులు పరామర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని