విహారం..శోక సంద్రం

సముద్ర స్నానం చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదవశాత్తు అలల ధాటికి గల్లంతైన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

Updated : 22 Jun 2024 05:26 IST

 సముద్ర స్నానం చేస్తున్న  ఇద్దరి మృతి.. మరో ఇద్దరి గల్లంతు  
 దుగ్గిరాలలో విషాదం
ఏలూరు నేర వార్తలు, వేటపాలెం, న్యూస్‌టుడే

తేజ ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు

సముద్ర స్నానం చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదవశాత్తు అలల ధాటికి గల్లంతైన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మెరైన్‌ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు...ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్రంలో స్నానాలు చేయడానికి ఓ వాహనంలో వేటపాలెం మండలం రామాపురం తీరానికి శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకున్నారు. వీరందరూ రామాపురం- కఠారిపాలెం మధ్యలో ఉన్న ఓ ప్రైవేట్‌ అతిథి గృహం ఎదురుగా సముద్రంలో స్నానాలు చేయడానికి దిగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు తేజ (17), కిశోర్‌(18), నితిన్‌ (18), అమూల్‌ రాజ్‌ (18) అలల దాటికి సముద్రంలో  గల్లంతయ్యారు. ఘటన జరిగిన రెండు గంటల తరువాత తేజ, కిశోర్‌ మృతదేహలు బయటకు కొట్టుకురాగా..మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వేటపాలెం మండలం రామాపురం సమీప సముద్రంలో గల్లంతైన నలుగురు యువకులది ఏలూరు నగర శివారు పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని జోసఫ్‌నగర్‌. ఆయా కుటుంబాల వారు ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారు. మొత్తం 11 మంది విహార యాత్రకు వెళ్లారు. క్షేమంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు జాలా కిశోర్, గొటికల తేజ మృతి చెందారని, చంటిమాల నితిన్, కోరు అమల్‌రాజు గల్లంతయ్యారన్న వార్త తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 

ఆహార పదార్థాలు తయారు చేసుకుని..

వారంతా స్నేహితులు. సరదాగా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఏడుగురు దుగ్గిరాలకు చెందిన వారు కాగా.. మరో నలుగురు పక్కనే ఉన్న అంకన్నగూడెం వాసులు. యాత్రకు వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి నుంచే హడావుడిగా ఉన్నారు. కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసుకుని శుక్రవారం దుగ్గిరాలలో వంటలు తయారు చేసుకుని ఓ వ్యాన్లో పెట్టుకుని బయలుదేరారు. నలుగురి కుటుంబ సభ్యులు కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు.

మాకు ఇక దిక్కెవరు 

గల్లంతైన చంటిమాల నితిన్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి ఆశీర్వాదం ప్రైవేటు టీచరుగా పని చేస్తున్నారు. నితిన్‌తో పాటు కుమార్తెను చదివిస్తున్నారు. విహారయాత్రకు వెళతానని నితిన్‌ అడిగితే తల్లిదండ్రులు తొలుత వద్దన్నారు. అయినా వారిని ఒప్పించి వెళ్లాడు. నవ్వుతూ వెళ్లిన కుమారుడు గల్లంతయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు..  కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆ తల్లికి తీరని వ్యధే మిగిలింది

సముద్రంలో గల్లంతైన కోరు అమల్‌రాజు తండ్రి బాలస్వామి గతంలోనే మృతిచెందారు. అప్పటి నుంచి తల్లి పావని కుమారుడిని చదివించుకుంటూ వస్తోంది. అమల్‌రాజుకు సోదరి ఉంది. కుమారుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి తీరని వ్యధే మిగిలింది. అందరి వంకా బేలచూపులు చూస్తూ  కుమిలి పోతోంది.


అందరి కంటే చిన్నోడు.. అందనంత దూరానికి..

మృతుల్లో ఒకరైన జాలా కిశోర్‌ తండ్రి బోయీజు కూలి పనులు చేస్తుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు. కిశోర్‌ అందరి కంటే చిన్నవాడు. తల్లిదండ్రులు గారాబంగా చూసుకుంటుంటారు. కిశోర్‌ కొంత వరకు చదివి ఆ తరువాత వంటలు చేయడం, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం వంటి పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రులకు భారం కాకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అతని మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.


ఉన్న ఒక్క కొడుకును కోల్పోయారు

ఆ తల్లిదండ్రులు తమకున్న ఒక్క కొడుకునూ కోల్పోయి రోదిస్తున్నారు. మృతుల్లో ఒకరైన తేజ ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి గొటికల డేవిడ్‌ రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తుంటారు. తేజకు సోదరి ఉంది. తల్లిదండ్రులు కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు కొడుకును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని