హాస్టల్లో ఉండలేను నాన్నా.. వచ్చేస్తా..

నాన్నా హాస్టల్‌లో ఉండలేకపోతున్నా.. ఇంటికి వచ్చేస్తా.. తీసుకెళ్లండి.. అంటూ కుమారుడు ఫోన్‌ చేశాడు.. సరే  అలాగే వద్దువు..

Updated : 22 Jun 2024 06:55 IST

అర్ధరాత్రి ఇంటికెళ్లేందుకు ప్రహరీ ఎక్కిన ఇంటర్‌ విద్యార్థి
విద్యుత్తు తీగలు తగిలి మృత్యువాత

గిరీష్‌కుమార్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నాన్నా హాస్టల్‌లో ఉండలేకపోతున్నా.. ఇంటికి వచ్చేస్తా.. తీసుకెళ్లండి.. అంటూ కుమారుడు ఫోన్‌ చేశాడు.. సరే  అలాగే వద్దువు.. నేనొచి తీసుకెళ్తా అని తండ్రి బదులిచ్చాడు. మరో రెండు రోజుల్లో హాస్టల్‌కు వెళ్లి ఇంటికి తీసుకొద్దామని అనుకున్నాడు. ఇంతలోనే విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించాడు. ఈ హృదయవిదారక ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన కర్రీ విజయ్‌కుమార్, చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్‌ నగరానికి వచ్చి ఈస్ట్‌మారెడుపల్లిలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు గిరీష్‌కుమార్‌ అరవంత్‌ (16) ఉన్నారు. పదో తరగతి పూర్తికావడంతో ఈనెల 12న గిరీష్‌ను హయత్‌నగర్‌ సమీపంలోని కోహెడ నారాయణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు. ఈనెల 16న ఆదివారం తల్లిదండ్రులు, అక్క అందరూ కలిసి హాస్టల్‌కు వెళ్లారు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పడంతో మరో రెండురోజులు చూడు నచ్చకపోతే వచ్చేద్దువు అని చెప్పి వెళ్లిపోయారు. ఈనెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.52 గంటలకు హాస్టల్‌ భవనం ఐదో అంతస్తులో ఉంటున్న గిరీష్‌కుమార్‌ కిందకు దిగాడు. కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై ఫెన్సింగ్‌ ఉంది. దాంతో కళాశాల ప్రాంగణంలోని గేటుకు ఎడమవైపున ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి కిందకు దిగేందుకు యత్నించాడు. పైన ఉన్న విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతంతో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
గురువారం ఉదయం 10 గంటలకు బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది ఫోన్‌చేసి చెప్పారు. దాంతో వారు  కళాశాలకు చేరుకున్నారు. అన్నిచోట్లా ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది.   చివరకు రాత్రి 8 గంటలకు బాలుడి తల్లి హయత్‌నగర్‌ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు.. పోలీసులు వెళ్లి సీసీ ఫుటేజీలు పరిశీలించగా గిరీష్‌ హాస్టల్‌ నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అర్ధరాత్రి కళాశాల ప్రాంగణం ప్రహరీ వెంబడి గాలిస్తుండగా గిరీష్‌ మృతదేహాన్ని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద చెట్ల పొదల్లో గుర్తించారు. హాస్టల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న గదిలోంచి బయకెళ్లిన 24 గంటల వరకూ ఎవరూ తమ కుమారుడిని గుర్తించలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. కళాశాల యజమాన్యం నిర్లక్ష్యం కుమారుడి ప్రాణాలు తీసిందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని