వివాహేతర బంధం ఆయువు తీసింది

వివాహేతర బంధం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణ హత్యకు గురైన ఘటనలు పాతబస్తీ ఫలక్‌నుమా, రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఠాణా పరిధుల్లో జరిగాయి.

Updated : 23 Jun 2024 05:15 IST

పాతబస్తీలో యువకుడు, షాబాద్‌లో మహిళ హత్య 

జాకీర్‌ అలీ , సంతోష

చాంద్రాయణగుట్ట, షాబాద్, న్యూస్‌టుడే: వివాహేతర బంధం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణ హత్యకు గురైన ఘటనలు పాతబస్తీ ఫలక్‌నుమా, రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఠాణా పరిధుల్లో జరిగాయి. ఫలక్‌నుమా ఏసీపీ యాదగిరి స్వామి వివరాల ప్రకారం.. హసన్‌నగర్‌ బాబా కాంటా ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ జాకీర్‌ అలీ(29)కు వట్టేపల్లి అచ్చిరెడ్డినగర్‌ మెరిడియన్‌ హోటల్‌ సమీపంలో నివసించే ఓ మహిళతో ఐదేళ్ల క్రితం పరిచయం అయింది. అది వారి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది. మహిళకు భర్త, పిల్లలు ఉన్నప్పటికి జాకీర్‌ అలీ తరచుగా ఆమె వద్దకు వచ్చి వెళుతుండే వాడు. ఆమె కుమార్తె పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ మహిళ ఈ విషయం వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన తన సోదరుడు మహ్మద్‌ షఫీ(32)కి తెలిపింది. శుక్రవారం రాత్రి మహిళ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె సోదరుడు, భర్త ఇంట్లోనే ఉన్నారు. ఆగ్రహంతో మహ్మద్‌ షఫీ ఇనుపరాడ్‌తో జాకీర్‌ అలీపై దాడి చేసి కొట్టాడు.జాకీర్‌ అలీ అక్కడికక్కడే మృతి చెందాడు.హాజీపాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అదృశ్యమై....: హత్యకు గురైన ఘటన మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కాంతారెడ్డి వివరాల ప్రకారం.. మోతి ఘనాపూర్‌కు చెందిన సంతోష(36)కు షాబాద్‌కు చెందిన తొంట రామస్వామితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది.  సంతోషకు రెండేళ్ల క్రితం ఫరూఖ్‌నగర్‌ మండలం ఆజిపల్లికి చెందిన సధుల సత్తయ్యతో పరిచయమై.. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. గత మార్చిలో సత్తయ్య బోనగిరిపల్లి సమీపంలోని ఒక వెంచర్లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరాడు. సంతోష, సత్తయ్యలు తరచూ అక్కడ కలుసుకునే వారు. ఆమె మరి కొందరితో సంబంధం పెట్టుకున్నట్లు సత్తయ్యకు అనుమానం వచ్చింది.  మార్చి 28న నైట్‌డ్యూటీలో ఉన్న సత్తయ్యను కలవడానికి సంతోష వచ్చింది. ఆమెతో గొడవ పడ్డాడు. కర్రతో ఆమె తలపై దాడి చేశాడు. నిందితుడు ఆమెను పక్కనే ఉన్న వాగులో గొయ్యి తీసి పాతిపెట్టాడు. నిందితుడిని అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని