సెల్‌ చోరీకి వచ్చి.. బాధితుల చేతిలో మృతి

సెల్‌ఫోన్‌ చోరీకొచ్చిన దొంగను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై తిరగబడ్డాడు. బాధితులు రక్షణ కోసం జరిపిన దాడిలో దొంగ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజాము జరిగింది.

Updated : 23 Jun 2024 06:10 IST

సయ్యద్‌ సమీర్‌ 

ఆసిఫ్‌నగర్, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ చోరీకొచ్చిన దొంగను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై తిరగబడ్డాడు. బాధితులు రక్షణ కోసం జరిపిన దాడిలో దొంగ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజాము జరిగింది. సౌత్‌ వెస్ట్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం సంతోష్‌నగర్‌కాలనీలో ఐదు అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోంది. అందులో పశ్చిమబెంగాల్‌కు చెందిన షేక్‌ సనావర్‌(29), షేక్‌ సలీం(30) కూలీలుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తమ పక్కనే సెల్‌ఫోన్‌ పెట్టుకుని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వారు నిద్రపోయారు. తెల్లవారుజాము 3గంటల సమయంలో మాసబ్‌ట్యాంకు ఫస్ట్‌లాన్సర్‌లోని బాదేప దర్గా ప్రాంతానికి చెందిన పాతనేరస్థుడు సయ్యద్‌ సమీర్‌(23) నిర్మాణంలోని భవనంలోని ప్రవేశించి సెల్‌ఫోన్‌ చోరీకి యత్నించాడు. అలజడికి నిద్రలేచిన కూలీలు దొంగను పట్టుకునేందుకు యత్నించారు. అయితే దొంగ.. తన వద్ద ఉన్న కత్తితో డాడి చేయగా, సనావర్‌ తొడకు గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న బాధితులు దొంగపై కర్రతో తలపై కొట్టారు. కుప్పకూలిపోయిన సమీర్‌ను తాళ్లతో కట్టేసిన బాధితులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ సమీర్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ కిషన్‌కుమార్‌ సందర్శించి బాధితులు సనావర్, సలీం నుంచి వివరాలు సేకరించారు. దొంగ నుంచి ఆత్మరక్షణ కోసమే బాధితులు తిరగబడ్డారని డీసీపీ తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  


గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని యువకుడి మృతి

సైదాబాద్‌: మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్‌నగర్‌లోని అన్నారం గ్రామానికి చెందిన సనుగోముల శ్రీకాంత్‌ (39) సోదరిని కలిసేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చాడు. వారు ఓ విందులో ఉండటంతో శ్రీకాంత్‌ కోఠిలో మద్యం తాగి చికెన్‌ బిర్యానీ తిన్నాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లక్ష్మీనగర్‌ కాలనీకి వచ్చాడు. అప్పటికే గొంతులో చికెన్‌ ముక్క ఉండటంతో శ్వాస ఆడక ఆటోలో కుప్పకూలిపోయాడు. డ్రైవర్‌ కాలనీ పాదబాటపై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అతడి చరవాణి ఆధారంగా మృతుడి సోదరిని సంప్రదించారు. మద్యం కారణంగా చనిపోయినట్లు భావించారు. శవపరీక్ష నిర్వహించగా, గొంతులో మాంసం ముక్క కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని