మహిళను చావగొడుతుంటే.. వీడియోలు తీస్తూ చూశారు!

బహిరంగ ప్రదేశంలో ఓ మహిళపై కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా దాడి చేస్తుండగా.. చుట్టూ మూగిన జనం సెల్‌ఫోన్లతో వీడియోలు తీస్తూ చోద్యం చూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Published : 23 Jun 2024 06:42 IST

మధ్యప్రదేశ్‌ గిరిజన జిల్లాలో ఘటన

ధార్‌ (మధ్యప్రదేశ్‌): బహిరంగ ప్రదేశంలో ఓ మహిళపై కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా దాడి చేస్తుండగా.. చుట్టూ మూగిన జనం సెల్‌ఫోన్లతో వీడియోలు తీస్తూ చోద్యం చూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గిరిజనులు అధికంగా ఉన్న ధార్‌ జిల్లా టాండా పోలీస్‌స్టేషను పరిధిలో గురువారం ఈ దాడి జరిగింది. ఆమె తనకు ఇష్టమైన వ్యక్తితో ఇంటి నుంచి పారిపోవడమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. బాధిత మహిళను నలుగురు వ్యక్తులు పట్టుకోగా, మరో వ్యక్తి పొడవాటి కర్రతో ఇష్టానుసారం చావబాదాడు. తనను కాపాడాలని ఆమె అక్కడున్నవారిని వేడుకొంటున్నా ఒక్కరూ ముందుకు రాలేదు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రి ఠాకుర్‌ సొంత నియోజకవర్గంలో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధార్‌ ఎస్పీ మనోజ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడైన నూర్‌సింగ్‌ భూరియాను అరెస్టు చేశామని, మిగతా నిందితుల పట్టివేతకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉందని ధ్వజమెత్తిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌కు ‘ఎక్స్‌’ పోస్టును ట్యాగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని