పోలీసు కాల్పుల కలకలం!

హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

Published : 23 Jun 2024 05:11 IST

దాడికి యత్నం.. చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్, చిలకలగూడ: హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో వరుస దొంగతనాలు, దోపిడీల నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌(సీపీ) కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వయంగా రాత్రివేళ పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, ఫలక్‌నుమా, ఆసిఫ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ఠాణాల్లో సిబ్బంది పనితీరు, రాత్రివేళల్లో ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల సన్నద్ధతను పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసిఫ్‌నగర్‌ ఠాణా సమీపానికి చేరిన సీపీ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టినట్టు తెలిసింది. ఆ కారులో ఉన్నవారికి గాయాలయ్యాయా అని సీపీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో ఒక గుంపు పోలీసుల వైపు అరుపులు, కేకలతో పరుగెత్తుతూ వచ్చి దాడికి యత్నించినట్లు సమాచారం. హఠాత్తుగా ఎదురైన పరిణామంతో.. పోలీసులు 2-3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గుంపును చెదరగొట్టినట్లు సమాచారం. అనంతరం సీపీ పలు సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి.. రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సౌత్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలో నేరాల కట్టడిలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. శాంతిభద్రతల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించినట్టు సమాచారం. రాత్రివేళ ఠాణాకే పరిమితమైన ఒక ఇన్‌స్పెక్టర్‌ను మందలించినట్టు తెలిసింది.

డెకాయ్‌ ఆపరేషన్‌తో సెల్‌ఫోన్‌ చోరుల పట్టివేత

సెల్‌ఫోన్‌ స్నాచర్లను పట్టుకునేందుకు నగరంలో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సీపీ ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో స్థానిక ఠాణా కానిస్టేబుల్, ఇద్దరు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు ఉంటారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాపులు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రజల మధ్య సివిల్‌ దుస్తుల్లో ఉంటూ సెల్‌ఫోన్‌ స్నాచర్లను పట్టుకోవడం.. ఈ బృందాల బాధ్యత. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక బృందం చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆలుగడ్డ బావి వద్ద డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ముగ్గురు కానిస్టేబుళ్లు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు చూస్తున్నారు. రాత్రి 2 గంటల సమయంలో ఆ మార్గంలోకి నలుగురు యువకులు వచ్చారు. ఓ కానిస్టేబుల్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయేందుకు యత్నించారు. వారిని కానిస్టేబుళ్లు వెంటాడి పట్టుకున్నారు. తప్పించుకునేందుకు కానిస్టేబుళ్లపై వారు భౌతికదాడికి దిగారు. దీంతో ప్రాణరక్షణ కోసం ఒక కానిస్టేబుల్‌ పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా, లేదా తెలియరాలేదు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులను తార్నాక, లాలాగూడ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని