అత్యాచారం, హత్య కేసులో ముగ్గురి అరెస్టు

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Jun 2024 05:22 IST

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ విలేకర్లకు వెల్లడించారు. ‘‘ఈపూరుపాలెం ప్రాంతానికే చెందిన పాత నేరస్థులైన దేవరకొండ విజయ్, కారంకి మహేష్‌ మద్యం మత్తులో యువతిని బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్యచేసి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని మళ్లీ ఘటనా స్థలానికి వచ్చారు. ఏమీ తెలియనట్లు అందరితోపాటు అక్కడి దృశ్యాలను చూశారు. అనంతరం అక్కడ నుంచి దేవరకొండ శ్రీకాంత్‌ సహకారంతో చీరాలలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉన్నారు. వారు ఘటనకు ముందు, తర్వాత అక్కడకు రావడాన్ని స్థానికులు గమనించారు. శ్రీకాంత్‌ ఫోన్‌ ఆధారంగా వీరి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలతో ముగ్గురిపై కేసు నమోదు చేశాం’’ అని ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన దుస్తులు, చెప్పులు, నీళ్ల సీసాను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించామన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం, హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి రావడంతో పాటు డీజీపీ, ఐజీ దీనిపై ప్రత్యేకదృష్టి సారించడంతో.. పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి, 48 గంటల్లోనే ఛేదించారని ఆయన తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 302, 376-డి 379, 212 కింద కేసులు నమోదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని