బెయిల్‌కు 2 నెలల కాలపరిమితి సరికాదు

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్‌ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

Published : 04 Jul 2024 03:45 IST

ఒరిస్సా హైకోర్టు తీర్పు సహేతుకంగా లేదన్న సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి రెండు నెలల కాల పరిమితి విధిస్తూ బెయిల్‌ మంజూరు చేసిన ఒరిస్సా హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. మే 6నాటి తీర్పు సందర్భంగా ఒరిస్సా హైకోర్టు....సర్వోన్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పును ఉటంకించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుతో పాటు సత్వర న్యాయ విచారణ కూడా రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉంటుందని పేర్కొంది. మాదక ద్రవ్యాల కేసు నిందితుడు 2022 మే 11 నుంచి కస్టడీలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క సాక్షి విచారణ మాత్రమే పూర్తయ్యిందని హైకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్‌కు రెండు నెలల బెయిల్‌ మాత్రమే మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ కేసును ట్రయల్‌ కోర్టుకు తిప్పి పంపించింది. దీనిపై నిందితుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సభ్యులుగా ఉన్న సెలవుకాల ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడికి బెయిల్‌ మంజూరు అధికారం హైకోర్టుకు ఉందని చెబుతూనే రెండు నెలల పరిమితి విధించడం, అందుకుగాను సర్వోన్నత న్యాయస్థానం గత తీర్పును ఉటంకించడాన్ని తప్పుపట్టింది. సత్వర న్యాయం జరగాలని భావించినప్పుడు సంబంధిత కేసు తుది విచారణకు లోబడి ఉండేలా నిందితునికి బెయిల్‌ మంజూరు చేయవచ్చని, ఆ వ్యక్తి విడుదలకు హైకోర్టు ఆదేశించి ఉండాల్సిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బెయిల్‌కు కాలపరిమితి విధించడానికి చూపిన కారణాలు సహేతుకంగా లేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిందితుడు బెయిల్‌ మీద ఉండవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని