పోలీసులకు చిక్కిన పార్థీ ముఠా

నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.

Published : 06 Jul 2024 03:24 IST

హైదరాబాద్‌ శివారులో అదుపులోకి ఇద్దరు
తప్పించుకునేందుకు కత్తులతో దాడి చేసిన దుండగులు

వాహనంలోని పార్థీ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుంటున్న నల్గొండ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్, నల్గొండ-అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే: నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు కూడలి వద్ద 30 ఏళ్లలోపు వయసున్న ఇద్దరిని శుక్రవారం నల్గొండ జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కాలంలో సుమారు పదికి పైగా దోపిడీలు, ఒక హత్యలో భాగస్వామ్యం ఉన్న వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కత్తులతో పోలీసులపైనే దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్‌తోపాటు ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ ముఠాను నల్గొండ జిల్లా చిట్యాల పోలీసుస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. 

పట్టుబడిన ఇద్దరు నిందితులు

మహిళ తీసిన ఫొటోతో.. 

జూన్‌ 9న నల్గొండ జిల్లా చిట్యాల ఠాణా పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డులో కారు నిలిపి నిద్రపోతున్న ఓ కుటుంబాన్ని ఈ ముఠా సభ్యులు తీవ్రంగా కొట్టి వారి వద్ద నుంచి బంగారం, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో బాధిత కుటుంబంలోని ఓ మహిళ.. పార్థీగ్యాంగ్‌కు సంబంధించిన ఓ నిందితుడి ఫొటో తీశారు. దీని ఆధారంగా ముఠాను పట్టుకోవడానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముఠా సభ్యులు సెల్‌ఫోన్లు వాడరు. దోపిడీలు పూర్తయ్యాక కల్లు కాంపౌండ్‌కు చేరతారు. అక్కడ పక్క వారితో మాట కలిపి మొబైల్‌ ఫోన్లు తీసుకొని కుటుంబసభ్యులతో మాట్లాడుతుంటారు. 

పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కాల్‌డేటా సేకరించారు. నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర పుణె సమీపంలోని ఇందాపూర్‌కు తరచూ కాల్స్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. ముఠాలోని ఓ సభ్యుడి భార్య నంబరును ట్రాక్‌ చేసిన పోలీసులు దానికి వస్తున్న కాల్స్‌పై నిఘా పెట్టారు. అందులో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కల్లుదుకాణ యజమాని నంబర్‌ సైతం ఉంది. అతడిని పోలీసులు ప్రశ్నించగా.. కొంత మంది మహారాష్ట్రకు చెందిన వారు తరచూ ఇక్కడకు వస్తారని చెప్పడంతోపాటు అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా తమ వద్ద ఫొటోలో ఉన్న వ్యక్తి, కెమెరాలో ఉన్న వ్యక్తి ఒక్కరే కావడంతో ముఠా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు ధ్రువీకరించుకున్నారు. గురువారం కల్లు కాంపౌండ్‌లో వారు మాట్లాడిన మాటల ఆధారంగా మహారాష్ట్ర పారిపోయేందుకు సిద్ధమైనట్టు గుర్తించారు. 


ఆటోలో ప్రయాణిస్తూ ఎలా చిక్కారంటే..

ముఠా సభ్యులు శుక్రవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం వద్ద ఎల్బీనగర్‌ వెళ్లేందుకు షేర్‌ ఆటో ఎక్కారు. నిందితులు నగరం వైపు బయలుదేరినట్లు పోలీసులు నిర్ధారించుకొని.. ఆటోను అనుసరించారు. పెద్దఅంబర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు కూడలిలో ఒక మహిళ కిందకు దిగింది. అక్కడే వాహనాన్ని నిలువరించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారి వద్ద ఉన్న కత్తులతో పోలీసులపైనే దాడికి దిగారు. నల్గొండ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పాత నేరాల ఆధారంగా ముఠా సభ్యులంతా ఎడమ చేతికి బంగారు రంగు వాచీ పెడతారని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఆటోలో ప్రయాణికుల్లో ఇద్దరి చేతికి ఉన్న బంగారు రంగు వాచీలతోనే పార్థీ గ్యాంగ్‌ అని నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు