ఉస్మానియా వైద్య కళాశాలలో గంజాయి కలకలం

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ ఉచ్చులో వైద్య విద్యార్థులు చిక్కారు. ధూల్‌పేట్‌లో గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లి.. టీజీన్యాబ్‌ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Published : 06 Jul 2024 03:18 IST

కొనుగోలు చేస్తూ పట్టుబడిన వైద్య విద్యార్థులు
సరఫరాదారు అరెస్టు 

ఈనాడు, హైదరాబాద్‌: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ ఉచ్చులో వైద్య విద్యార్థులు చిక్కారు. ధూల్‌పేట్‌లో గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లి.. టీజీన్యాబ్‌ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. మూడేళ్లుగా వైద్యవిద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ధూల్‌పేట్‌కు చెందిన సురేశ్‌సింగ్‌ అలియాస్‌ టింకుసింగ్‌ (38)ను అరెస్ట్‌ చేసినట్టు టీజీన్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య తెలిపారు. ఉస్మానియా వైద్యకళాశాలకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట నివాసి సురేశ్‌సింగ్‌ 2016 నుంచి అదే ప్రాంతానికి చెందిన దినేష్‌సింగ్‌ నుంచి గంజాయి సేకరించి విక్రయించేవాడు. మూడేళ్లుగా ఇతడి వద్దనే వైద్యవిద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దినేష్‌సింగ్‌..పంకజ్‌సింగ్‌ వద్ద గంజాయి తీసుకుంటున్నట్లు తేలింది. దీనిపై అందిన సమాచారం మేరకు ఎస్పీ సీతారామ్‌ పర్యవేక్షణలో డీఎస్పీ కె.నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ బృందం దాడిచేసి సురేశ్‌సింగ్‌ను అరెస్టు చేసింది. వైద్యకళాశాలలో మరో 10 మంది వరకు మత్తు ఉచ్చులో చిక్కుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. డ్రగ్స్‌ మహమ్మారి కట్టడిలో పౌరులు భాగస్వాములు కావాలని, 87126 71111 నంబర్‌కు సమాచారం అందజేయాలని సందీప్‌శాండిల్య సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని