చిన్నారిని విక్రయించిన వైద్యులు

బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్‌ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు.

Updated : 07 Jul 2024 03:23 IST

ప్రభుత్వ వైద్యుడైన కొడుకుతో కలిసి ఓ ప్రైవేటు వైద్యుడి నిర్వాకం
కామారెడ్డి జిల్లాలో ఘటన

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: బాధ్యత గల విధుల్లో ఉండి అందరికీ అవగాహన కల్పించాల్సిన వైద్యులే తప్పుదోవ పట్టారు. ప్రైవేటు క్లినిక్‌ నిర్వహిస్తున్న తండ్రి, ప్రభుత్వ వైద్యుడైన కొడుకు కలిసి ఓ వివాహితకు ప్రసవం చేశారు. పుట్టిన శిశువును గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. తాడ్వాయి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు రామారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. అయితే తాను అప్పటికే ఆరు నెలల గర్భవతి అనే విషయాన్ని భర్తకు తెలియకుండా దాచిపెట్టింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 8న కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజరుగా పనిచేస్తున్న ఉదయ్‌కిరణ్‌ను సంప్రదించింది. అతడు వైద్యుడు సిద్ధిరాములు వద్దకు తీసుకెళ్లగా.. తన గర్భం తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా వద్దని చెప్పి రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. దీనికి అంగీకరించిన సిద్ధిరాములు,  గాంధారి సీహెచ్‌సీలో వైద్యాధికారిగా పని చేస్తున్న తన కొడుకు ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఏప్రిల్‌ 11న రాత్రి ఆమెకు నొప్పుల ఇంజక్షన్లు ఇచ్చి ప్రసవం చేశారు. పుట్టిన ఆడశిశువును ఓ వ్యక్తికి రూ.20 వేలకు అమ్మేశారు. ఆ ఆసుపత్రిలో తెలిసినవారు మహిళను గమనించి ఆమె భర్తకు ఆలస్యంగా విషయం చెప్పారు. దీంతో ఆయన చైల్డ్‌లైన్‌ను సంప్రదించడంతో.. కామారెడ్డి డీసీపీవో పట్టణ ఠాణాలో ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. విచారణలో శిశువు విక్రయం వాస్తవమేనని తెలియడంతో కేసు నమోదు చేసి తండ్రీకొడుకులు సిద్ధిరాములు, ప్రవీణ్‌కుమార్, మేనేజర్‌ ఉదయ్‌కిరణ్, ఆసుపత్రి వాచ్‌మెన్‌ బాలరాజు, పాప తల్లి, కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. శిశువును నిజామాబాద్‌ శిశుగృహానికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని