పీసీబీ దస్త్రాల దహనం కేసులో సెక్షన్ల మార్పు

కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 07 Jul 2024 05:18 IST

నిందితులుగా ఓఎస్డీ, డ్రైవర్, అటెండర్లు

పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు సెక్షన్లు మార్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గతంలో బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 106 సెక్షన్‌ కింద కేసు పెట్టగా, దీన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 324, 316, 238 సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. ప్రభుత్వ సంస్థకు చెందిన పత్రాలను చీకట్లో, గుట్టుగా అక్రమంగా బయటకు తరలించడం, అనుమతుల్లేకుండా ధ్వంసం చేయడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసులో డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ రూపేంద్ర, సమీర్‌ శర్మ ఓఎస్డీ రామారావులను నిందితులుగా చేర్చారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల నమోదు పూర్తైంది. ఓఎస్డీ రామారావు చెప్పిన మీదటే తాము ఫైళ్లు తగలబెట్టామని డ్రైవర్, అటెండర్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. త్వరలోనే రామారావుకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. పీసీబీ అధికారులను కూడా పిలిపించి వారితో ఈ దస్త్రాలను పరిశీలింపజేయనున్నారు. తర్వాత పీసీబీ అధికారులను సాక్షులుగా పరిగణిస్తూ వారి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈ కేసులో మరికొందరు అధికారుల ప్రమేయాన్ని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిపోయిన పత్రాల్లో రహస్య పత్రాలు ఎన్ని ఉన్నాయో విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని