మెగామాల్‌ నుంచి ఫోన్‌ నంబర్లు సేకరించి.. రూ.కోట్లు కొల్లగొట్టిన నొయిడా కిలాడీలు

మందుల దుకాణం.. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌.. మెగామాల్స్‌.. వంటిచోట్ల కొనుగోళ్లు చేసినపుడు బిల్లింగ్‌ సమయంలో ఫోన్‌ నంబరు అడుగుతుంటారు. తప్పనిసరి కానప్పటికీ, రివార్డు పాయింట్లు వస్తాయని కొందరు..

Published : 08 Jul 2024 03:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మందుల దుకాణం.. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌.. మెగామాల్స్‌.. వంటిచోట్ల కొనుగోళ్లు చేసినపుడు బిల్లింగ్‌ సమయంలో ఫోన్‌ నంబరు అడుగుతుంటారు. తప్పనిసరి కానప్పటికీ, రివార్డు పాయింట్లు వస్తాయని కొందరు.. నంబరు ఇస్తే ఏమవుతుందిలే అని ఇంకొందరు ఇచ్చేస్తుంటారు. నేరగాళ్లు ఈ డేటాను కొనుగోలు చేసి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. దిల్లీ శివారున ఉన్న నొయిడాలో తాజాగా ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మెగామాల్‌ నుంచి రూ.2,500కు వినియోగదారుల ఫోన్‌ నంబర్లు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రూ.కోట్లు సంపాదించారు. గత ఏడాదికాలంగా సాగుతున్న ఈ ఘరానా మోసాన్ని తాజాగా పోలీసులు ఛేదించారు. నొయిడాలోని సెక్టార్‌ 51లో ఓ అనధికార కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేసిన ఆశిష్, జితేంద్ర 9 మంది మహిళా సిబ్బందిని కూడా నియమించుకున్నారు. దిల్లీలోని ఓ మెగామార్ట్‌ సిబ్బందికి రూ.2,500 ఇచ్చి 10,000 మంది వినియోగదారుల ఫోన్‌ నంబర్లు సేకరించి ఆ మహిళలకు ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా వివిధ బీమా పాలసీలు ఇస్తామంటూ అవతలివాళ్లు పాలసీ తీసుకునేలా ఒప్పించడమే వారి పని. ఎక్కువమందిని ఒప్పిస్తే.. ఎక్కువ జీతం ఇస్తామని ఆశ పెట్టారు. ప్రధానంగా దిల్లీ నగరానికి బయట ఉన్నవారిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. తమ ఉనికిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా తప్పుడు ఆధార్‌ వివరాలతో 10 సిమ్‌కార్డులు తీసుకున్నారు. వాటి ద్వారా మాత్రమే కాల్‌సెంటర్‌ ఉద్యోగులు ఫోన్లు చేసేవారు. ఒకవేళ మోసపోయామని ఎవరైనా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చిరునామా ఆధారంగా గుర్తుపట్టకుండా ఉండేందుకే ఈ పన్నాగం. 

బాధితులు పంపిన డబ్బు విషయంలోనూ ఆశిష్, జితేంద్ర పక్కా ప్లానుతో వ్యవహరించారు. కర్ణాటకకు చెందిన అర్వింద్‌ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాను నెలకు రూ.10,000 చొప్పున అద్దెకు తీసుకున్నారు. పాలసీలకు ఆకర్షితులైనవారిని ఆ ఖాతాలో డబ్బు జమ చేయాలని కోరేవారు. డెబిట్‌ కార్డు సాయంతో ఆ డబ్బులను విత్‌డ్రా చేసుకునేవాళ్లు. కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. కాల్‌సెంటర్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులకు  నలుపురంగు డైరీ దొరికింది. గత ఏడాదికాలంలో జరిగిన ప్రతి లావాదేవీ వివరాలు అందులో ఉన్నాయి. రూ.కోట్లలో జరిగిన మోసాలను చూసి పోలీసులు విస్తుపోయారు. ఆశిష్, జితేంద్రలతోపాటు అక్కడ పనిచేస్తున్న 9 మంది మహిళలనూ అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు