మద్యం మత్తులో ప్రాణం తీశారు

చిన్నపాటి గొడవతో ఓ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసిన ఘటనలో నిందితులైన 17, 18 ఏళ్లలోపు ముగ్గురు బాలలను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 08 Jul 2024 03:36 IST

యువకుడిని కొట్టి చంపి, మృతదేహాన్ని కాల్చేసిన ముగ్గురు బాలురు 
కేసును ఛేదించిన బాసర పోలీసులు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: చిన్నపాటి గొడవతో ఓ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసిన ఘటనలో నిందితులైన 17, 18 ఏళ్లలోపు ముగ్గురు బాలలను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లో ఎస్పీ జానకీషర్మిల ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. బాసర ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు ఒకే ద్విచక్రవాహనంపై మే 31న తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో మద్యం తాగేందుకు వెళ్లారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం ఫకీరాబాద్‌కు చెందిన అర్జున్‌(20) కూడా మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చాడు. ఎవరికి వారు అధికంగా మద్యం తాగారు. మత్తులో నడవలేని స్థితిలో ఉన్న అర్జున్‌ను అతని వెంట వచ్చిన ఇద్దరు వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముగ్గురు బాలలు బాసర వెళ్తున్నారని తెలుసుకుని తనకు అక్కడి వరకు లిఫ్ట్‌ ఇవ్వమని అడిగాడు. వారు నిరాకరించడంతో దూషించాడు. దీంతో ఆగ్రహించిన మైనర్లు అతడిని చంపేద్దామని నిర్ణయించుకుని, తమతోపాటు బైక్‌పై ఎక్కించుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత బాసరకు తీసుకొచ్చారు. అక్కడ అర్జున్‌ను తీవ్రంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని ముళ్లకంప మీద వేసి నిప్పుపెట్టి వెళ్లిపోయారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో బాసర పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎట్టకేలకు కేసు ఛేదించారు. నిందితులను బాలల న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు ఎస్పీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని