మొలకెత్తని విత్తనం.. యమపాశమైన రుణభారం!

రెండు సార్లు విత్తనాలు విత్తినా వర్షాలు కురవక మొలకెత్తలేవు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న దిగులుతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 08 Jul 2024 03:38 IST

మనస్తాపంతో మహిళా రైతు బలవన్మరణం

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: రెండు సార్లు విత్తనాలు విత్తినా వర్షాలు కురవక మొలకెత్తలేవు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న దిగులుతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆదివారం వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెడితండాకు చెందిన బానోతు కమలమ్మ(38) రాయపర్తి మండలం తిర్మాలాయపల్లి గ్రామానికి చెందిన రాజయ్య, కుమారస్వామిలకు చెందిన తొమ్మిదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. గత మే నెలాఖరులో వర్షాలు పడటంతో జూన్‌లో అప్పులు చేసి పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అనంతరం వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దేవుడిపైనే భారం వేసి తిరిగి రెండుసార్లు పత్తి గింజలు నాటినా ఫలితం దక్కలేదు. పత్తి సాగుకు చేసిన అప్పులతో పాటు ఇతర అవసరాలకు తెచ్చిన రుణం రూ.5 లక్షల వరకు పేరుకుపోయింది. పంటలు పండకపోవడంతో ఈ అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందిన కమలమ్మ శనివారం ఇంట్లో పురుగుమందు తాగారు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కమలమ్మ ఆదివారం చనిపోయారు. ఆమె భర్త రాంథాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని