డ్రగ్స్‌ తీసుకున్నాకే.. పబ్‌కు!

గంజాయి, డ్రగ్స్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో నిర్వహించిన పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఖాజాగూడలోని ‘ది కేవ్‌’ పబ్‌ నిర్వాహకులు ‘సైకిడెలిక్‌’ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడం చూసి పోలీసులే విస్తుపోయారు.

Published : 08 Jul 2024 03:40 IST

‘సైకిడెలిక్‌’ పేరుతో ప్రత్యేక పార్టీ
‘ది కేవ్‌’లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
25 మంది అరెస్టు.. పరారీలో నలుగురు ప్రధాన నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌ - రాయదుర్గం, న్యూస్‌టుడే: గంజాయి, డ్రగ్స్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో నిర్వహించిన పార్టీ వ్యవహారం కలకలం రేపింది. ఖాజాగూడలోని ‘ది కేవ్‌’ పబ్‌ నిర్వాహకులు ‘సైకిడెలిక్‌’ పేరుతో ప్రత్యేకంగా పార్టీ నిర్వహించడం చూసి పోలీసులే విస్తుపోయారు. ఈ మేరకు టీజీ న్యాబ్, సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు శనివారం అర్ధరాత్రి పబ్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేసి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఐటీ, వ్యాపార రంగాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీ నిర్వహణలో ప్రధాన సూత్రధారులైన పబ్‌ నిర్వాహకులు నలుగురు పరారీలో ఉన్నారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్‌ అదనపు డీసీపీ జయరామ్, ఏసీపీ శ్రీకాంత్‌తో కలిసి డీసీపీ డాక్టర్‌ వినీత్‌ ఆదివారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం ఠాణా పరిధి ఖాజాగూడలో ది కేవ్‌ పబ్‌ను నగరానికి చెందిన రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ తదితరులు నిర్వహిస్తున్నారు. మేనేజర్‌గా నాగారంలోని శిల్పానగర్‌కు చెందిన ఆర్‌.శేఖర్‌కుమార్‌ వ్యవహరిస్తున్నాడు. డ్రగ్స్‌ తీసుకునేవారిని ప్రోత్సహిస్తే ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో వీరంతా శనివారం రాత్రి ‘సైకిడెలిక్‌’ పేరుతో పబ్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ప్రవేశానికి రూ.3 వేల చొప్పున ధర నిర్ణయించి సామాజిక మాధ్యమాల ద్వారా ‘ఫారెస్ట్‌ ఆల్కెమీ’ తదితర కోడ్‌ భాషల్లో పార్టీ ఉన్నట్లు సమాచారం పంపించారు. ఎవరికివారు ముందస్తుగా డ్రగ్స్‌ తీసుకుని పబ్‌కు రావాలని తెలిపారు. ఇలా వచ్చినవారికి ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌ ఉంటుంది. సాధారణ వ్యక్తులు భరించలేనంతగా.. డ్రగ్స్‌ తీసుకుంటేనే ఆస్వాదించేలా శబ్దాలుండేలా ఏర్పాట్లు చేశారు.

బెంగళూరు నుంచి డీజే..

ఈ పార్టీ కోసం నిర్వాహకులు నగరంలోని న్యూమల్లేపల్లికి చెంది.. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న డీజే అబ్దుల్లా ఆయుబ్, దమ్మాయిగూడకు చెందిన డీజే ఎ.సాయిగౌరంగ్‌లను పిలిపించారు. సామాజిక మాధ్యమాల్లో సందేశానికి స్పందించి మొత్తం 55 మంది హాజరయ్యారు. కాగా ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ డీఎస్పీ చల్లా శ్రీధర్, మాదాపూర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ దాలినాయుడు, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న బృందాలు అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా సోదాలు నిర్వహించాయి. పబ్‌కు హాజరైనవారందరినీ అదుపులోకి తీసుకుని ప్రత్యేక కిట్లతో డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. డీజేలు అబ్దుల్లా ఆయుబ్, సాయిగౌరంగ్, మరో 22 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరు, భువనగిరిలకు చెందిన ఇద్దరు ఉండగా మిగతావారంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఈ 24 మందితోపాటు పబ్‌ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పబ్‌ నిర్వాహకులు రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ పరారీలో ఉన్నారు. వీరు గతంలోనూ పార్టీలు నిర్వహించినట్లు తేలింది. పబ్‌ లైసెన్సు రద్దు చేస్తామని డీసీపీ వినీత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని