ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్లతో కోసి.. రూ. 30 లక్షల దోపిడీ

పక్కా ప్రణాళికతో ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్లతో కోసి వాటిలోని రూ.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు ముగ్గురు ముసుగు దొంగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాలలో చోటుచేసుకుంది.

Published : 08 Jul 2024 05:02 IST

గ్యాస్‌ కట్టర్లతో కోసిన ఏటీఎం 

గుడిపాల, న్యూస్‌టుడే: పక్కా ప్రణాళికతో ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్లతో కోసి వాటిలోని రూ.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు ముగ్గురు ముసుగు దొంగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాలలో చోటుచేసుకుంది. గుడిపాల ఎంపీపీ కార్యాలయం వద్ద ఒకే గదిలో స్టేట్‌ బ్యాంకుకు చెందిన 2 ఏటీఎంలు ఉన్నాయి. శనివారం సాయంత్రమే బ్యాంకు అధికారులు వాటిలో రూ.32 లక్షలు పెట్టారు. ఖాతాదారులు రూ.2 లక్షలు డ్రా చేశారు. ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ముఖానికి కండువాలు చుట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఏటీఎంల గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఓ సీసీ కెమెరాను మరో వైపు తిప్పారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎంలను కోశారు. కేవలం 15 నిమిషాల్లో యంత్రాలను కోసి, అందులోని డబ్బుతో ఉడాయించారు. ఇదంతా అక్కడే ఉన్న మరో కెమెరాలో రికార్డయింది. తెల్లవారుజామున 4 గంటలకు ఏటీఎం గదిలోంచి పొగ వస్తుండటంతో అటుగా వచ్చిన స్థానికులు చోరీ విషయం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ రవిశంకర్, ఎస్సై నరేంద్రకుమార్‌ ఘటనా స్థలం పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించింది. ఎస్పీ మాట్లాడుతూ.. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఇవే ఏటీఎంలలో గతంలో రెండు సార్లు చోరీకి యత్నించినట్లు తెలిసింది.

ఏటీఎంల గదిలో గ్యాస్‌ కట్టర్లతో దుండగులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని