మిహిర్‌ షా కోసం 11 బృందాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది.

Updated : 09 Jul 2024 04:00 IST

లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ
బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసులో దర్యాప్తు వేగవంతం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్‌ షా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్రైం బ్రాంచీని అప్రమత్తం చేయడంతోపాటు నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశముందన్న అనుమానంతో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ)ను జారీ చేశారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త గాయపడ్డారు. కారు ముందు భాగంలో చిక్కుకున్న కావేరి నక్వాను 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లాక మిహిర్‌ షా, ఆ కారులో ఉన్న రాజశ్రీ బిదావత్‌ కలిసి కారు నుంచి విడదీశారు. అనంతరం బిదావత్‌ కారు వెనక్కు నడుపుతూ మరోసారి కావేరి నక్వాపై నుంచి పోనిచ్చాడు. ఆపై కాలా నగర్‌వైపు కారులో పారిపోతుండగా అది ఆగిపోయింది. దీంతో మిహిర్‌ తన తండ్రి రాజేశ్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన వచ్చి పారిపోవలసిందిగా కుమారుడికి సూచించాడు. ఇంతలో గాయపడిన నక్వా భర్త, ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్‌ షా, రాజశ్రీ బిదావత్‌లను అదుపులోకి తీసుకున్నారు. కారు వద్ద నుంచి పారిపోయిన మిహిర్‌ తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు పరారైనట్లు నిర్ధారించారు. నిందితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్‌ జుహూ ప్రాంతంలోని ఓ బార్‌లో మద్యం తాగినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని