మావోయిస్టు నేత మహ్మద్‌ హుస్సేన్‌ అరెస్టు

మావోయిస్టు నేత మహ్మద్‌ హుస్సేన్‌(73) అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ రమాకాంత్‌ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 09 Jul 2024 03:52 IST

మందమర్రి పట్టణం, జమ్మికుంట, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: మావోయిస్టు నేత మహ్మద్‌ హుస్సేన్‌(73) అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ రమాకాంత్‌ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2 నెలలుగా మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పార్టీ, సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) పునర్నిర్మాణం కోసం సానుభూతిపరులు పని చేస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం మందమర్రి, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో విస్తృతంగా పెట్రోలింగ్‌ చేపట్టారు. ఆర్కే-1 గని సమీపంలో మహ్మద్‌ హుస్సేన్‌ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అతని సంచిని తనిఖీ చేయగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు, కరపత్రాలు లభించాయి. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ 1978 నుంచి 1981 వరకు మందమర్రి కేకే-2 గనిలో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేశారు. తరువాత రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరారు. కొన్నేళ్లకు ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. అతనిపై వివిధ పోలీసుస్టేషన్లలో 28 కేసులు ఉన్నాయి. 2009లో ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో అరెస్టయ్యారు. 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యుల సూచనతో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో సికాస పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో రామకృష్ణాపూర్‌ ఠాణాలో ఆయనపై కేసు నమోదైందని సీపీ తెలిపారు. 

వృద్ధుడిని తీసుకెళ్లి ఏం చేస్తారు..?

జమ్మికుంటలోని తమ ఇంటికి ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి హుస్సేన్‌ను వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారని ఆయన సోదరుడి కుమారుడు రబ్బానీ, కోడలు రసూల్‌బీ ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత తామే అరెస్టు చేశామని రామకృష్ణాపూర్‌ ఠాణా పోలీసులు ఫోన్‌ చేయడంతో వెళ్లామని, కానీ హుస్సేన్‌ను చూపించలేదని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని తీసుకెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. మహ్మద్‌ హుస్సేన్‌ను తక్షణమే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు తదితరులు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని