ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Published : 10 Jul 2024 03:18 IST

తుర్కపల్లి, భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. దొంకెన రాజయ్య (54)కు 1.20 ఎకరాల పొలం ఉంది. రాజయ్య తన పొలంతో పాటు ఇతర రైతుల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పు చేసి ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. ఇటీవల ట్రాక్టరు సైతం కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తక్యూద్దీన్‌ తెలిపారు.


వంగరలో మహిళా కౌలురైతు... 

అప్పుల బాధతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరి సునీత(40), శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. సొంత పొలం లేకపోవడంతో గ్రామంలో రెండెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. కుమార్తె వివాహం, ఇంటి అవసరాల కోసం సుమారు రూ.15లక్షల వరకు అప్పులు చేశారు. వడ్డీలు పెరగడంతో ఇటీవల ఇంటిని రూ.7 లక్షలకు విక్రయించి కొంత మొత్తం అప్పులు చెల్లించారు. ఇల్లు అమ్మినా రుణం తీరలేదన్న బాధతో సునీత ఈనెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో విషగుళికలు నీళ్లలో కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని