సింగరేణి ఉన్నతాధికారికి రూ.3.31 కోట్ల టోకరా

సింగరేణిలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఒక అధికారికి సైబర్‌ నేరగాళ్లు రూ.3.31 కోట్లు టోకరా వేశారు.

Published : 10 Jul 2024 03:08 IST

బంగారం ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్ల మోసం

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణిలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఒక అధికారికి సైబర్‌ నేరగాళ్లు రూ.3.31 కోట్లు టోకరా వేశారు. ఆయన ఫిర్యాదుమేరకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్‌లోనే నమోదైనా కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారి(58)కి ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్‌లో ఒక అర్చన అనే మహిళ పరిచయమైంది. తాను పారిశ్రామికవేత్తనని చెప్పింది. తన సమీప బంధువు కపిల్‌చౌదరి ఆల్‌లైన్‌ ట్రేడింగ్‌లో నిపుణుడని, న్యూమాంట్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ మైనింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌లో బంగారం ట్రేడింగ్‌ చేస్తున్నాడని వివరించింది. తర్వాత కపిల్‌ ఫోన్‌లో మాట్లాడాడు. తాను కెనడాలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నానని.. తనకు భార్య, కుమార్తె ఉన్నారని, నవంబరులో ఇండియాకు వస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే కపిల్‌ బంగారం ట్రేడింగ్‌తో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి అధికారితో పెట్టుబడులు పెట్టించాడు. డబ్బు సరిపడా లేకపోతే రుణం తీసుకుని పెట్టుబడులు పెట్టాలని... వచ్చిన లాభంతో వాయిదాలు కట్టాలని చెప్పాడు. రూ.10 లక్షలకు రూ.1.5 లక్షలు బోనస్‌గా వస్తుందని చెప్పి 2 బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేయించేవాడు. జూన్‌ 7 తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. ఆయన మొత్తం రూ.1.3 కోట్లు పెట్టుబడి పెట్టగా.. లాభాలతో కలిపి విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒక మెలిక పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. అలా చెల్లించిన మొత్తం 3.31 కోట్లయింది. చివరకు 3 నెలల పాటు డబ్బు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు అధికారి గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఎస్‌బీలో కేసు నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని