అనంతలో తెదేపా కార్యకర్త హత్య

పాత కక్షలతో తెదేపా కార్యకర్తను దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదెప్ప (50)ను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా నరికి గ్రామ శివారులో పడేశారు.

Published : 10 Jul 2024 05:09 IST

వైకాపా నాయకుల దుశ్చర్య
దేవాలయ అర్చకత్వంపై వివాదం నేపథ్యంలో దారుణం

రాయదుర్గం గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: పాత కక్షలతో తెదేపా కార్యకర్తను దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదెప్ప (50)ను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా నరికి గ్రామ శివారులో పడేశారు. ఏడాదిన్నర కిందట గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఓ వర్గం గ్రామంలో లేని సమయంలో మరో సామాజిక వర్గం వారు ప్రత్యర్థుల ఇళ్లలోకి దూరి మహిళలపై విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నాడు అధికార వైకాపా నాయకులు బాధితులైన 16 మంది తెదేపా వర్గీయులపైనే కేసు నమోదు చేయించారు. దీంతో గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 16 మందిని రిమాండ్‌కు తరలించారు. 10 మంది వైకాపా వర్గీయులపై ఫిర్యాదు చేసినా కేసు నమోదులో పోలీసులు వివక్ష చూపినట్లు అప్పట్లో గ్రామస్థులు ఆరోపించారు. చివరకు, వైకాపా మద్దతుదారులపై తక్కువ తీవ్రత గల సెక్షన్‌లతో కేసు పెట్టారు. అప్పటి నుంచి గ్రామంలో కక్షలు పెరగ్గా, ఎన్నికలు ముగిసే వరకు పోలీసుల పికెట్‌ కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, తర్వాత రెండు నెలల్లోపే ఈ దారుణం జరగడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

ఇదీ వివాద నేపథ్యం..

గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయ అర్చకత్వంపై రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దాదాపు మూడేళ్లుగా దేవాలయంలో ఇతరులు పూజలు చేయడంతో గ్రామంలో కక్షలు పెరిగాయి. అర్చకులు కొందరు గ్రామస్థుల మద్దతుతో కోర్టుకు వెళ్లారు. కోర్టు అర్చకులకు అనుకూలంగా రెండేళ్ల కిందటే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ వైకాపా వర్గీయులు అడ్డుకోవడంతో అర్చకులు దేవాలయం వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎన్డీయే అధికారంలోకి రావడంతో రెండ్రోజుల కిందట అర్చకులు దేవాలయం తలుపులు తెరిచి యథావిధిగా పూజాదికాలు కొనసాగిస్తున్నారు. ఆలయ పునఃప్రారంభంలో ఆదెన్న కీలకంగా వ్యవహరించారు. మెచ్చిరి గ్రామం కర్ణాటకకు ఆనుకుని ఉంటుంది. ఆదెన్న వ్యక్తిగత పనిమీద మంగళవారం ద్విచక్ర వాహనంపై కర్ణాటకకు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో కుటుంబీకులతో ఫోనులో మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొలకాల్మూర్‌ తాలూకా పేదారగుడ్డం (హుచ్చంగి దుర్గం) వెళ్లే దారిలో ఆదెప్ప మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. తల, చేతులు, పొట్ట, ఛాతీ తదితర భాగాలపై కత్తిపోటు ఆనవాళ్లు కనిపించాయి. ద్విచక్ర వాహనం కూడా పక్కనే వదిలి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి గ్రామ శివారులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదెన్నకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ తెదేపాలో క్రియాశీలకంగా పని చేసేవారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని