ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం

ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు సహా కారును చెరువులోకి పోనిచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు సత్వరం గుర్తించి.. ఆ నలుగురినీ కాపాడిన ఘటన బుధవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 11 Jul 2024 02:44 IST

కారుతో పాటు చెరువులో మునుగుతుండగా గుర్తింపు
సత్వరం స్పందించి కాపాడిన స్థానికులు

మునుగుతున్న కారుపై ఉన్న వారిని ట్యూబ్‌ సాయంతో కాపాడుతున్న దృశ్యం

అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్‌ న్యూస్‌టుడే: ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు సహా కారును చెరువులోకి పోనిచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు సత్వరం గుర్తించి.. ఆ నలుగురినీ కాపాడిన ఘటన బుధవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల ప్రాంతానికి చెందిన అశోక్‌.. హైదరాబాద్‌ మీర్‌పేట్‌ ప్రాంతంలోని శ్రీహోమ్స్‌ కాలనీలో భార్య, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఆయన నిర్మాణ రంగంలో మిల్లర్‌ కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్నారు. అప్పులతో అవస్థలు పడుతున్నట్లు అశోక్‌ చెప్పారని పోలీసులు తెలిపారు. అశోక్‌ ఉదయమే ‘అశోక్‌ శ్రద్ధాంజలి.. మళ్లీ జన్మంటూ ఉంటే కలుద్దాం.. ఓకే బై..’ అంటూ రాసి తన వాట్సప్‌ స్టేటస్‌లో ఫొటో పెట్టుకున్నారు. తన ముగ్గురు పిల్లలు... అభిజ్ఞ(14), శ్రీధర్‌(13), సహస్ర(9)లను తీసుకొని సమీపంలో నడక కోసమంటూ కారులో బయలుదేరారు. వాకింగ్‌ అనంతరం ఇంటికి తిరిగి వెళ్లకుండా టిఫిన్‌ చేద్దామని పిల్లలకు చెప్పి కారులోనే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ పరిధిలోని భైరన్‌ఖాన్‌ చెరువు వద్దకు చేరుకున్నారు. గట్టు మీద నుంచి కారును ఆయన చెరువులోకి పోనిచ్చారు. కారు నీటిలో మునుగుతుండగా బద్రీనాథ్‌ అనే వ్యక్తి గమనించారు. అక్కడికి సమీపంలో తాటిచెట్టుపై ఉన్న గీత కార్మికుడు పాండుకు తెలిపారు. పాండు వెంటనే ఇనాంగూడలోని కుమారుడు సాయికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. సాయి వెంటనే స్పందించి చుట్టుపక్కల వారితో కలిసి ట్యూబ్, తాడుతో అక్కడకు చేరుకున్నారు. ఇంతలో అశోక్‌ మునిగిపోతున్న కారు నుంచి తన పిల్లల్ని కారుపైకి ఎక్కించారు. సాయి సహా స్థానికులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే అశోక్‌ సోదరుడు సంజీవ్‌.. మీర్‌పేట పోలీసులకు అశోక్, ఆయన ముగ్గురు పిల్లలు కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. దాంతో మీర్‌పేట పోలీసులు.. అశోక్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఇనాంగూడ చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పటికే వారిని స్థానికులు కాపాడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అశోక్, ముగ్గురు పిల్లలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. సమయస్ఫూర్తితో నాలుగు ప్రాణాలను కాపాడిన సాయి, గీత కార్మికుడు పాండును స్థానికులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని