నువ్వు మారలేదు నాన్నా..

క్షణికావేశంలో భార్య మృతికి కారణమైనందుకు పద్నాలుగేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలలో భాగంగా జైలు నుంచి బయటికొచ్చి అనాథాశ్రమంలో ఉన్న కుమార్తె, కుమారుడి దగ్గరకు వెళ్లాడు.

Published : 11 Jul 2024 04:45 IST

14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తండ్రి
మూడు రోజులకే కన్నబిడ్డలను వదిలి దూరంగా వెళ్లిపోయిన వైనం

ఈనెల 5న సారయ్యకు పిల్లలను అప్పగిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు వీరస్వామి, శోభారాణి

ఈనాడు, కరీంనగర్‌- న్యూస్‌టుడే, జమ్మికుంట: క్షణికావేశంలో భార్య మృతికి కారణమైనందుకు పద్నాలుగేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలలో భాగంగా జైలు నుంచి బయటికొచ్చి అనాథాశ్రమంలో ఉన్న కుమార్తె, కుమారుడి దగ్గరకు వెళ్లాడు. పోషణ బాధ్యతలు తీసుకుంటానని చెప్పి వారిని తీసుకెళ్లిన మూడు రోజులకే మాయమాటలు చెప్పి ఉడాయించాడు. దీంతో ఆ అక్కాతమ్ముళ్లు మరోసారి ఆశ్రమానికి చేరారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన సోమ సారయ్య, సత్తమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2010లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో సారయ్య బలంగా నెట్టేయడంతో సత్తమ్మ కింద పడి మృతి చెందింది. అతడ్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో కుమార్తె పూజకు 5, కుమారుడు బన్నీకి 3 సంవత్సరాలు. భార్య హత్య కేసులో సారయ్యకు జీవిత ఖైదు పడింది. చిన్నారుల కష్టాన్ని చూసి అప్పటి సీఐ సుందరగిరి శ్రీనివాస్‌రావు జమ్మికుంటలోని స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ అనాథాశ్రమంలో చేర్పించారు. నిర్వాహకులు వీరస్వామి, శోభారాణి పిల్లల ఆలనా పాలనా చూశారు. ప్రస్తుతం పూజ డిగ్రీ, బన్నీ ఇంటర్‌ సంవత్సరం చదువుతున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం ఈ నెల 3న విడుదల చేయగా సారయ్య చంచల్‌గూడ జైలు నుంచి బయటికొచ్చాడు. 5వ తేదీన ఆశ్రమానికి వచ్చి పిల్లలను తీసుకెళ్లాడు. జమ్మికుంటలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 8న జైలు అధికారులు తనను రమ్మంటున్నారంటూ చెప్పి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. మంగళవారం ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌లోనే పని చూసుకొని, మరో పెళ్లి చేసుకొని అక్కడే ఉంటానని చెప్పడంతో అక్కాతమ్ముడు హతాశులయ్యారు. ‘ఇకపై మీకు నాకు సంబంధం లేదు.. ఆధార్, సర్టిఫికెట్లలోనూ తండ్రి పేరు తీసేయండి’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. పిల్లలిద్దరూ తీవ్ర ఆవేదనకు లోనై ఎటు వెళ్లాలో తెలియక తిరిగి ఆశ్రమానికే వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని