సెజ్‌లోకి ఐఎంఎస్‌ అవినీతి సొమ్ము!

బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము మళ్లింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నాలుగైదు స్థిరాస్తి వ్యాపారాల్లోకి, జడ్చర్లలోని ఫార్మాసెజ్‌లో ఏర్పాటు చేసిన

Updated : 16 Apr 2021 11:25 IST

జడ్చర్ల ఫార్మాలోని ఓ సంస్థలో పెట్టుబడులు
కీలక ఆధారాలు సేకరించిన ఈడీ

ఈనాడు, హైదరాబాద్‌: బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము మళ్లింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నాలుగైదు స్థిరాస్తి వ్యాపారాల్లోకి, జడ్చర్లలోని ఫార్మాసెజ్‌లో ఏర్పాటు చేసిన ఓ సంస్థలోకి తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు గత శనివారం సోదాలు నిర్వహించారు. అనిశా అధికారులు గతంలోనే కొంతమందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మందుల కొనుగోళ్లు కీలకం కాగా వాటిని తమకు అనుకూలమైన సంస్థల నుంచే చేపట్టాలని అప్పటి కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వీరి ప్రమేయానికి ఆధారాలు దొరకలేదు. దాంతో అనిశా అధికారులు వీరిపై చర్యలు తీసుకోలేకపోయారు. అయితే మందుల కొనుగోళ్లలో తమ పలుకుబడి ఉపయోగించడం వల్ల పెద్దఎత్తున లబ్ధి పొందారని, అలా ఆర్జించిన మొత్తాన్ని వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తించిన అనిశా అప్పట్లోనే ఈడీని అప్రమత్తం చేసింది.  దీని ఆధారంగానే ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ(ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌) కింద కేసు నమోదు చేసి గత నవంబరులో ఐఎంఎస్‌ మాజీ సంచాలకురాలు దేవికారాణి భర్త గురుమూర్తి, కార్మికశాఖ మంత్రి పీఎస్‌గా పనిచేసిన ముకుందరెడ్డిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐఎంఎస్‌ కుంభకోణంలోనూ వీరి ప్రమేయం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని స్థిరాస్తి సంస్థల సమాచారాన్ని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) నుంచి తెప్పించారు.

బినామీల ఆదాయ వివరాల సేకరణ
అనుమానితులు తమ బంధువులను పలు సంస్థల్లో భాగస్వాములుగా చేర్చినట్లు, జడ్చర్లలోని ఫార్మా సెజ్‌లో స్థాపించిన ఓ ఔషధ సంస్థలోనూ వీరు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. దీన్ని నిర్ధారించుకునేందుకు శనివారం సోదాలు నిర్వహించారు. మరోపక్క ఆయా సంస్థల్లో బినామీలుగా ఉన్న వారి ఆదాయ వివరాలు సేకరిస్తున్నారు. అంత పెట్టుబడులు పెట్టడానికి వారికున్న ఆదాయ మార్గాలు ఏమిటన్నదానిపై దృష్టి సారించారు. ‘‘మొదట్లో తమ అక్రమార్జనను సక్రమమైనదిగా చూపించే ఉద్దేశంతో నకిలీ స్థిరాస్తి సంస్థలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వ్యాపారం జరిగినట్లు, దాన్నుంచే పెద్దమొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. తర్వాత తమ బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారు’’ అని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇదంతా నిధుల మళ్లింపు కిందికే వస్తుంది. నిధుల ప్రవాహాన్ని గుర్తించి వాటి ద్వారా కూడబెట్టిన ఆస్తులు స్వాధీనానికి ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts