బ్లాక్‌ ఫంగస్‌ బాధితురాలి ఆత్మహత్య

బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్య చేసుకోగా... కరోనాతో బాధపడుతున్న వ్యక్తి ఒకరు చనిపోయారు...

Published : 14 Jun 2021 05:06 IST

చికిత్స పొందుతూ కరోనా రోగి మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని కుటుంబసభ్యుల ఆందోళన
తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో ఘటనలు

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్య చేసుకోగా... కరోనాతో బాధపడుతున్న వ్యక్తి ఒకరు చనిపోయారు... ఈ రెండు ఘటనలూ తిరుపతి స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆసుపత్రిలో చోటు చేసుకోగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
*నెల్లూరుకు చెందిన చెందిన కమతం జయమ్మ (60) అదే నగరంలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సు. మే 4న ఆమెకు కరోనా సోకగా అదే నెల 13న నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈక్రమంలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడటంతో గత నెల 26న స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలోని ప్రత్యేక ఈఎన్‌టీ వార్డులో చేరారు. ఈ నెల 10న బాధితురాలికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడక మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం వార్డులోని స్నానాల గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ...
చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం రంగనాథపురానికి చెందిన వినోద్‌ కుమార్‌ (27) కొవిడ్‌ బారినపడ్డారు. కుటుంబ సభ్యులు రూ.లక్షలు ఖర్చు పెట్టి పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. ఫలితం లేకపోవడంతో గత నెల 29న స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే వినోద్‌ కుమార్‌ మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి, భార్య పిల్లలు బోరున విలపిస్తూ న్యాయం చేయాలని నినదించారు.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
యువకుడు మృతి చెందడం, బ్లాక్‌ఫంగస్‌ బాధితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో శ్రీహరి, స్విమ్స్‌ సూపరింటెండెంట్‌ రామ్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి ఆసుపత్రి చేరుకొని ఘటనలపై ఆరా తీశారు. వినోద్‌కుమార్‌ కుటుంబసభ్యులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని