పంజాబ్‌లో హత్య.. హైదరాబాద్‌లో మకాం

పంజాబ్‌లో ఓ యువకుడి హత్యకు పాల్పడి ఆ రాష్ట్ర పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా హంతకుడొకరు రాష్ట్ర పోలీసులకు చిక్కాడు. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా బెగోవాల్‌ పట్టణంలో గత నెల 18న ముఖుల్‌ అనే 23 ఏళ్ల యువకుడు క్రీడామైదానం నుంచి ఇంటికి వస్తుండగా...

Updated : 12 Jul 2021 06:57 IST

హైదరాబాద్‌లో అమ్మాయిల్ని బెదిరించి చిక్కిన ఘరానా హంతకుడు

ఈనాడు, హైదరాబాద్‌: పంజాబ్‌లో ఓ యువకుడి హత్యకు పాల్పడి ఆ రాష్ట్ర పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా హంతకుడొకరు రాష్ట్ర పోలీసులకు చిక్కాడు. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా బెగోవాల్‌ పట్టణంలో గత నెల 18న ముఖుల్‌ అనే 23 ఏళ్ల యువకుడు క్రీడామైదానం నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు అటకాయించి అంతమొందించారు. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు దల్జీత్‌ సింగ్‌ షేరా గ్యాంగ్‌పై కేసు నమోదైంది. జలంధర్‌ జిల్లా కర్తార్‌పుర్‌కు చెందిన షేరా పాత నేరస్థుడు. అతడి గ్యాంగ్‌కు చెందిన ఓ సభ్యుడి హత్యలో ప్రమేయం ఉందనే అనుమానంతో ముఖుల్‌ను తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు షేరా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో 1900 కి.మీ.లకు పైగా సంచరించాడు. ముఖుల్‌ను హత్య చేసింది తానేనంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేరా పోస్ట్‌ పెట్టాడు. ఇంకా హత్యలు చేస్తానంటూ హెచ్చరించాడు. పోలీసులు సవాల్‌గా తీసుకొని గాలించినా దొరకలేదు. చివరకు హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలోని అజయ్‌కుమార్‌ అనే సెక్యూరిటీగార్డు ఇంట్లో షేరా తలదాచుకున్నాడు.

సెల్‌ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించి..
కొద్దిరోజుల క్రితం షేరా గచ్చిబౌలిలో మద్యం మత్తులో సంచరిస్తూ సెల్‌ఫోన్లు ఇవ్వాలంటూ ఇద్దరు అమ్మాయిలను బెదిరించాడు. విషయం తెలిసి ఓ యువకుడు షేరాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ వాగ్వాదం జరగడంతో షేరా తన వద్ద ఉన్న తుపాకీని తీసి చంపుతానంటూ హల్‌చల్‌ చేశాడు. భయపడిన బాధితులు అక్కడి నుంచి పారిపోయి డయల్‌ 100కు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన గచ్చిబౌలి పోలీసులు షేరాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడటంతో పంజాబ్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు షేరాను హైదరాబాద్‌ న్యాయస్థానంలో హాజరుపరిచి పీటీ వారంట్‌పై రెండు రోజుల క్రితం పంజాబ్‌ తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని