గొంతులో చేపపిల్ల ఇరుక్కొని చిన్నారి మృతి

తల్లి ఒడిలో బోసినవ్వులు చిందిస్తున్న చిన్నారికి అవే ఆఖరి క్షణాలయ్యాయి. తండ్రి చేతిలోని చేప పిల్ల బిడ్డ నోట్లోకి వెళ్లడం.. గొంతులో చిక్కుకొని విలవిల్లాడటం..

Updated : 13 Jul 2021 06:43 IST

భర్తే కుక్కాడని తల్లి ఆరోపణ

ఉండి, న్యూస్‌టుడే: తల్లి ఒడిలో బోసినవ్వులు చిందిస్తున్న చిన్నారికి అవే ఆఖరి క్షణాలయ్యాయి. తండ్రి చేతిలోని చేప పిల్ల బిడ్డ నోట్లోకి వెళ్లడం.. గొంతులో చిక్కుకొని విలవిల్లాడటం.. ప్రాణాలు పోవడం అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. బిడ్డను సరదాగా ఆడిస్తుండగా ఘోరం జరిగిపోయిందని తండ్రి చెబుతుండగా.. తన భర్త కావాలనే చేప పిల్లను గొంతులో కుక్కాడని తల్లి ఆరోపిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ చినపేటకు చెందిన తోలాపు నారాయణకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుధారాణితో 2019లో పెళ్లైంది. వీరికి 9 నెలల బాబు నందకిశోర్‌ ఉన్నాడు. ఆదివారం గొరక రకం చేపలు కొనుక్కొచ్చిన నారాయణ.. ఇంట్లో నీళ్ల బకెట్లో వేశాడు. తల్లి ఒడిలో ఉన్న చిన్నారికి చేప పిల్లను చూపిస్తూ ఆడించాడు. అంతలోనే చేప చిన్నారి నోట్లోకి వెళ్లి గొంతులో ఇరుక్కుపోయింది. బయటకు లాగేందుకు ప్రయత్నించినా రాలేదు. కళ్లు తేలేసిన బిడ్డను ఆకివీడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అనుమానంతోనే ఘాతుకం: సుధారాణి

మద్యానికి బానిసైన తన భర్త తరచూ తనను అనుమానించి, హింసించేవాడని సుధారాణి సోమవారం విలేకరుల ముందు వాపోయింది. ‘ప్రసవానికి రాజమహేంద్రవరం వెళ్లిన నన్ను 9 నెలల పాటు తీసుకురాలేదు. పది రోజుల క్రితమే ఇక్కడ అద్దె ఇంట్లో దిగగా.. వచ్చినప్పటి నుంచి గొడవ పడుతున్నాడు. ఆదివారం నా కాలి పట్టీలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి తాగొచ్చాడు. బిడ్డను ఆడిస్తున్నట్లు నటించి చేప పిల్లను నోట్లోకి నెట్టేశాడ’ని రోదించింది. తల్లి ఆరోపణపై ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా, ఆదివారమే కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని