AP News: ‘అడిగిన డబ్బు ఇవ్వకుంటే బాబును చంపేస్తా’

జల్సాలకు అలవాటు పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి డబ్బుల కోసం కన్నబిడ్డనే అపహరించాడు. డబ్బులివ్వకపోతే పిల్లాడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కందుకూరులోని

Updated : 01 Aug 2021 08:20 IST

 భార్యకు బెదిరింపులు

జల్సాలకు అలవాటుపడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నిర్వాకం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటు పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి డబ్బుల కోసం కన్నబిడ్డనే అపహరించాడు. డబ్బులివ్వకపోతే పిల్లాడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కందుకూరులోని పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ వి.శ్రీరామ్‌ వివరాలను వెల్లడించారు. పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డికి అదే గ్రామానికి చెందిన ఉమ అనే యువతితో అయిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాదిగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జూదం, మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ససేమిరా అనడంతో జులై 28న కన్న కుమారుడినే అపహరించాడు. అనంతరం బాలుడిని కందుకూరు పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి మద్యం తాగి భార్యకు ఫోన్‌ చేశాడు. పిల్లాడ్ని అపహరించానని.. రూ.20 లక్షలు ఇవ్వకపోతే వాడిని హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆమె పొన్నలూరు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సాంకేతికత సహాయంతో కందుకూరులోని ఓ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. పిల్లాడిని విడిపించి తల్లికి అప్పగించారు. నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు కృషిచేసిన సీఐ శ్రీరామ్‌, పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబులను డీఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని