TS News: ‘నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి.. వయసు కూడా అయిపోయేలా ఉంది’

‘ఉద్యోగం సాధించలేకపోయా. అందుకే చనిపోతున్నా’ అంటూ ఓ యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 02 Aug 2021 08:21 IST

రైలుకింద పడి యువకుడి బలవన్మరణం

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఉద్యోగం సాధించలేకపోయా. అందుకే చనిపోతున్నా’ అంటూ ఓ యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే, స్థానిక పోలీసుల వివరాలిలా ఉన్నాయి. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహ్మద్‌ షబ్బీర్‌ (26) ఆదివారం మధ్యాహ్నం జమ్మికుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చరవాణి ఆధారంగా రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ జి.తిరుపతి గుర్తించి మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. షబ్బీర్‌ జేబులో ఉన్న లేఖను పోలీసులు వెల్లడించారు. ‘నా చావుకు కారణం నిరుద్యోగం. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూశా. మా అమ్మానాన్నలు నన్ను ఎంతో కష్టపడి డిగ్రీ, ఐటీఐ చదివించారు. కాని నాకు ఉద్యోగం రాలేదు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి.. వయసు కూడా అయిపోయేలా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే చనిపోతున్నా’ అని షబ్బీర్‌ పేరిట ఆ లేఖలో రాసి ఉంది. షబ్బీర్‌ 9 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని చిన్న పరిశ్రమల్లో పనిచేసినా కరోనా వేళ ఆ ఉపాధి కూడా దూరమవడంతో భార్యతోపాటు జమ్మికుంటకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్నాళ్లపాటు అతని సోదరులే అద్దె చెల్లించారు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో షబ్బీర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అతడి తండ్రి అంకుష్‌మియా, తల్లి అంకుష్‌బీ. కూలి పనులతో జీవించే వీరి ముగ్గురు కుమారుల్లో షబ్బీర్‌ చిన్నవాడు. ఇద్దరు అన్నలు డిగ్రీ చదివి, ఉపాధి అవకాశాల్ని అందుకున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆదివారం సాయంత్రం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. అంబులెన్స్‌లో ఉన్న మృతదేహంతోనే నిరసన తెలిపారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు డబుల్‌బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని