Crime: పొలం దక్కలేదని తండ్రీకుమారుల బలవన్మరణం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కోటా వీధిలో రెండు రోజుల వ్యవధిలోనే తండ్రీకుమారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలాన్ని ఇతరుల పేరుపై ఆన్‌లైన్‌ చేయడంతో మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుల...

Published : 09 Aug 2021 08:04 IST

రెవెన్యూ అధికారులే కారణమని బంధువుల ఆరోపణ

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కోటా వీధిలో రెండు రోజుల వ్యవధిలోనే తండ్రీకుమారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలాన్ని ఇతరుల పేరుపై ఆన్‌లైన్‌ చేయడంతో మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుల బంధువులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. కోటా వీధికి చెందిన సుబ్బరాయుడు (60), వెంకటలక్ష్మి దంపతులకు కుమారుడు నాగరమేశ్‌ (22), కుమార్తె ఉన్నారు. రూ.కోట్ల విలువ చేసే వీరి రెండెకరాల భూమిని సంబంధం లేనివారి పేర్లపై రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని కోరుతూ సుబ్బరాయుడు, నాగ రమేశ్‌ ఏడేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 5న నాగరమేశ్‌ నంద్యాల శివారులో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ 7న మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సుబ్బరాయుడు శనివారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తండ్రీకుమారుల మృతికి రెవెన్యూ అధికారుల అక్రమాలే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుల బంధువులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ ఓబులేసు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని