Viveka Murder Case: రక్తపు మడుగులో పడి ఉంటే... సాధారణ మరణమని ఎలా అనుకున్నారు?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే మీరు సాధారణ మరణమని ఎలా అనుకున్నారని వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం

Updated : 13 Aug 2021 07:01 IST

వివేకా హత్యకేసులో ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్‌ సురేంద్రనాథ్‌రెడ్డిని విచారించిన సీబీఐ

కడప నేరవార్తలు, పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే మీరు సాధారణ మరణమని ఎలా అనుకున్నారని వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్‌, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు ప్రశ్నించగా, కంగారులో సరిగా గుర్తించలేక పోయానని బదులిచ్చినట్లు సమాచారం. గురువారం సీబీఐ అధికారులు కడప, పులివెందులలో పలువురు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ డ్రైవర్‌ దస్తగిరిని కారులో ఎక్కించుకుని వివేకానందరెడ్డి ఇంటికి తీసుకెళ్లి వారి సమక్షంలో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వీరిద్దరిని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. పులివెందులకే చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను విచారించారు. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. సునీల్‌కుమార్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది యతీష్‌రెడ్డి పులివెందుల కోర్టుకు వెళ్లి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకునే సమయంలో అతని తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్‌కు విన్నవించారు. అనంతరం సీబీఐ అధికారులు కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎదుట హాజరయ్యారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మరో సీబీఐ బృందం ముగ్గురు అనుమానితులను విచారించారు. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్రగంగిరెడ్డి, వివేకా పొలం పనులు చూసుకునే జగదీశ్వరరెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌రెడ్డి, ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి, సునీల్‌కుమార్‌ బంధువు భరత్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు విచారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని