బొల్లారంలో చంపేసి.. శనిగరం గుట్టల్లో పూడ్చేసి..

వివాహేతర సంబంధం తాళి కట్టిన భర్తను హత్య చేయించింది. ప్రియుడితో కలిసి తన భర్తను.. ఆలి అంతమొందించింది. తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం పోలీసులు శనివారం తెలిపిన వివరాలు..

Published : 15 Aug 2021 05:10 IST

ప్రియుడితో కలసి భర్తను అంతమొందించిన భార్య

కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం తాళి కట్టిన భర్తను హత్య చేయించింది. ప్రియుడితో కలిసి తన భర్తను.. ఆలి అంతమొందించింది. తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం పోలీసులు శనివారం తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన చౌహాన్‌ ప్రపూన్‌(29) ఆటోడ్రైవర్‌. తన భార్య జ్యోతితో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ఆటోడ్రైవర్‌ కృష్ణతో సన్నిహితంగా ఉండేవాడు. తరచూ ఇంటికి వచ్చే కృష్ణకు చౌహాన్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వారిద్దరూ చౌహాన్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించారు. మే 6వ తేదీన కృష్ణ, చౌహాన్‌ కలిసి మద్యం తాగారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మత్తులో ఉన్న చౌహాన్‌ను భార్య జ్యోతి, ప్రియుడు కృష్ణతో కలసి కొట్టి హత్య చేసింది. శవాన్ని గోనెసంచిలో మూట కట్టి అదేరోజు రాత్రి చౌహాన్‌ ఆటోలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం-తంగళ్లపల్లి గుట్టల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ పాతిపెట్టి నగరానికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె కాల్‌ లిస్ట్‌ ఆధారంగా భార్యే హంతకురాలని గుర్తించారు. పోలీసులు జ్యోతిని విచారించగా ప్రియుడితో కలిసి అంతమొందించినట్లు నిర్ధారణ అయింది. శనివారం మధ్యాహ్నం నిందితులిద్దరినీ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ మృతదేహం, గోనెసంచి, ఇతర ఆనవాళ్లు లభ్యమయ్యాయి. బొల్లారం సీఐ ప్రశాంత్‌, కోహెడ తహసీల్దార్‌ రుక్మిణిల సమక్షంలో చౌహాన్‌ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని