Published : 15 Aug 2021 05:21 IST

నా అప్పులను సీఎం తీర్చాలి

వైరల్‌ అవుతున్న వాలంటీరు లేఖ

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు సరిపోక కుటుంబ పోషణకు అప్పులు చేశానని, వాటిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీర్చాలని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ తొమ్మిదో వార్డు వాలంటీరు మహేష్‌ (ఉమేష్‌) రాసినట్లు పేర్కొంటున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ యువకుడు బుధవారం (ఈనెల 11) రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించడంతో నలుగురు అక్కాచెల్లెళ్లకు వివాహాలు చేసి మెట్టినింటికి పంపారు. వివాహాలు, కుటుంబ పోషణకు రూ.3 లక్షలు అప్పులు చేశాడని, వాటిని ఎలా తీర్చాలో తెలియక బలవన్మరణానికి పాల్పడినట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు యువకుడు రాసినట్లు పేర్కొంటున్న లేఖ శనివారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. వారంలో మూడు రోజులు పని చేస్తే చాలని తమను విధుల్లోకి తీసుకుని ప్రస్తుతం రాత్రి, పగలు పని చేయించుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ కష్టాలు, ఇబ్బందులను తెలుసుకోవాలని, జీతాల గురించి ముఖ్యమంత్రి ఆలోచించాలని కోరారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటిస్థలం తన అక్కకు ఇవ్వాలని, కుటుంబీకులను రుణదాతలు ఒత్తిడి చేయొద్దని విన్నవించారు. తాను అప్పు తీసుకున్నవారి పేర్లు, చరవాణుల నంబర్లను సైతం రాశారు. యూపీఎస్‌ సీఐ ఈరన్న మాట్లాడుతూ.. వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న రోజు అతని జేబుల్లో వెతికామని, ఎలాంటి లేఖ లభ్యం కాలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న లేఖపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని