ఎంబీఎస్‌ జ్యూయలర్స్‌పై ఈడీ కొరడా

ప్రభుత్వరంగ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)ను మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన ఎంబీఎస్‌ గ్రూపు సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఎంబీఎస్‌ జ్యూయలర్స్‌, ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ సంస్థల

Updated : 29 Aug 2021 05:26 IST

రూ.363.51 కోట్ల ఆస్తుల జప్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)ను మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన ఎంబీఎస్‌ గ్రూపు సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఎంబీఎస్‌ జ్యూయలర్స్‌, ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ సంస్థల నిర్వాహకులు సుఖేష్‌ గుప్తా, అనురాగ్‌ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తాలకు చెందిన రూ.363.51 కోట్ల విలువైన 45 స్థిరాస్తుల్ని తాత్కాలికంగా జప్తు చేసింది. ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సుఖేష్‌గుప్తా సెక్యూరిటీ డిపాజిట్‌, ఫారెక్స్‌ కవర్‌ లేకుండా బంగారం తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకుండా, ఎంఎంటీసీ ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు సమర్పించారు. అలా ఈ ఏడాది మే చివరి నాటికి ఎంఎంటీసీకి వడ్డీతో కలిపి రూ.504.34 కోట్లు బకాయి పడినట్లు తేలింది. కొనుగోలుదారుల క్రెడిట్‌ పథకం ద్వారా సేకరించిన బంగారాన్ని అక్రమంగా విక్రయించడం ద్వారా సుఖేష్‌గుప్తా భారీఎత్తున లాభాలు, ఆస్తులు గడించినట్లు గుర్తించిన సీబీఐ 2014లోనే అభియోగపత్రం దాఖలు చేసింది. దీనిపై మనీ ల్యాండరింగ్‌ నిరోధ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ చేపట్టిన దర్యాప్తునకు సుఖేష్‌ గుప్తా సహకరించలేదు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం కింద నమోదు చేసిన మరో కేసులోనూ ఎంబీఎస్‌ సంస్థలకు గతంలో ఈడీ రూ.222 కోట్ల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఎంఎంటీసీ బకాయిలను చెల్లించేందుకు సంస్థల నిర్వాహకులు 2019లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)కు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పటివరకు నిధులు జమ చేయకపోవడంతో ఓటీఎస్‌లో పూర్తిగా విఫలమైనట్లు ఎంఎంటీసీ నివేదిక స్పష్టం చేసింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని