Crime News: చంకలో చిన్నారిని కాటేసిన పాము

పది నెలలు నిండని పాలబుగ్గల పసితనం.. బోసి నవ్వుల మోముతో కన్నతల్లిని మైమరపించే రూపం.. కేరింతలు కొడుతూ తనలో తానే ఆనందపడే ప్రాయం.. అలాంటి అభంశుభం తెలియని ఓ చిన్నారిని కనికరం లేని మృత్యువు కాలనాగు రూపంలో కాటేసి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన ఆదివారం సాయంత్రం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణావత్‌ గణేశ్‌-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం.

Updated : 07 Sep 2021 07:57 IST

ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృత్యువాత

నాంపల్లి, న్యూస్‌టుడే: పది నెలలు నిండని పాలబుగ్గల పసితనం.. బోసి నవ్వుల మోముతో కన్నతల్లిని మైమరపించే రూపం.. కేరింతలు కొడుతూ తనలో తానే ఆనందపడే ప్రాయం.. అలాంటి అభంశుభం తెలియని ఓ చిన్నారిని కనికరం లేని మృత్యువు కాలనాగు రూపంలో కాటేసి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన ఆదివారం సాయంత్రం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణావత్‌ గణేశ్‌-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. ఆదివారం సాయంత్రం తమ పది నెలల కుమారుడు భవిత్‌ను తల్లి చంకలో ఎత్తుకొని ఇంట్లో ఆడిస్తున్నారు. కిటికీలో ఉన్న ఆటబొమ్మలను చిన్నారికి అందించేందుకు తల్లి కిటికీ వద్దకు వెళ్లారు. ఇంటి లోపల గోడలకు ప్లాస్టరింగ్‌ చేయకపోవడంతో అప్పటికే ఇటుకల మధ్యలో దూరి ఉన్న తాచుపాము చిన్నారి కాలుపై కాటు వేసింది. బాబు ఉలికిపాటును గమనించిన తల్లి అటువైపు తిరిగేలోపే మళ్లీ కాటేసింది. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన తల్లి కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చీకటి పడటంతో గ్రామస్థులు పాము బయటకు రాకుండా కాపలా కాశారు. సోమవారం చౌటుప్పల్‌ నుంచి పాములు పట్టే వ్యక్తిని రప్పించి తాచుపామును బంధించారు. క్షణాల వ్యవధిలో చిన్నారి కళ్లెదుటే కన్నుమూయడంతో ఆ తల్లి రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని