Karnataka: ఈ విల్లా.. ‘గంజాయి ఖిల్లా’

కర్ణాటక రాజధాని నగరి బెంగళూరు శివారు బిడది సమీపంలోని ఓ విల్లాలో పూల కుండీల్లో గంజాయి సాగు చేస్తున్న నలుగురు నిందితులను నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విల్లాలోని గదుల్లో ఎల్‌ఈడీ దీపాల వెలుగులో

Updated : 29 Sep 2021 07:06 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటక రాజధాని నగరి బెంగళూరు శివారు బిడది సమీపంలోని ఓ విల్లాలో పూల కుండీల్లో గంజాయి సాగు చేస్తున్న నలుగురు నిందితులను నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విల్లాలోని గదుల్లో ఎల్‌ఈడీ దీపాల వెలుగులో హైడ్రో గంజాయి సాగు చేస్తున్న ఇరాన్‌కు చెందిన జావెద్‌, అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి విలువైన మొక్కలు, గంజాయి స్వాధీనపరుచుకున్నారు. విద్యార్థి వీసాపై భారతదేశానికి వచ్చిన జావెద్‌.. కాలపరిమితి ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉంటున్నాడు. గతంలో బాణసవాడిలో హైడ్రో గంజాయి సాగు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా బిడది సమీపంలోని విల్లాను నెలకు రూ.36 వేలు బాడుగ చెల్లిస్తూ ఏడాదిన్నరగా ఉంటున్నాడు. ఐరోపా నుంచి విత్తనాలు తెప్పించుకుని సాగు ప్రారంభించాడు. విల్లాలో 130 హైడ్రో గంజాయి మొక్కలు, 12.85 కిలోల గంజాయి, కారు, నాలుగు చరవాణులు, అల్ట్రావైలెట్‌ దీపాలు, ఎల్‌ఈడీ దీపాలు, ఎలక్ట్రానిక్‌ తూనిక యంత్రం స్వాధీనపరుచుకున్నామని సీసీబీ జాయింటు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. హైడ్రో గంజాయి సాగుపై వెబ్‌సైట్లలో చదివి తెలుసుకుని, సాగు చేస్తున్నాడని చెప్పారు. గతంలో ఇతనిపై డి.జె.హళ్లి, యశ్వంతపుర ఠాణాల్లో కొన్ని కేసులు నమోదైనట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని