Updated : 08 Nov 2021 08:59 IST

Crime News: ఎక్కడ చంపారు? ఇక్కడెందుకు పడేశారు?

మిస్టరీగా బాలిక మృతి కేసు

ఘటనా స్థలంలో బాలిక మృతదేహం

సోమాజిగూడ, నారాయణగూడ, న్యూస్‌టుడే: నాలుగైదేళ్ల వయసున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. దీపావళి రోజు(గురువారం) ఉదయం జేవీఆర్‌ పార్కు ఎదుట ద్వారకాపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక పడిఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదన్న నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల పుటేజీ పరిశీలించినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. చిన్నారి మృతదేహంపై పాత గాయాలున్నాయని, అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ శుక్రవారం వెల్లడించారు. ‘రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలిక ఎప్పుడు? ఎలా మరణించింది? శరీరంపై ఇంకా ఏమైనా గాయాలున్నాయా? అనేది తెలుస్తుంది. రెండు రోజుల్లో నిందితులను గుర్తిస్తాం’ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఠాణాలతోపాటు..సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు చెప్పారు. బాలిక గురించిన సమాచారం తెలిస్తే ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి (94906 16610), డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్య (94906 16613), ఎస్‌ఐ సతీష్‌ (94906 16365)లకు తెలియజేయాలని కోరారు. క్షుద్రపూజల కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 బాలిక ఫొటోతో పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts